Site icon NTV Telugu

కెప్టెన్‌గా రోహిత్ శర్మ గత రికార్డులు

విరాట్ కోహ్లీ తర్వాత భారత్ టీ20 జట్టుకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేయాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయం వెనుక అనేక కారణాలున్నాయి. రోహిత్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు సహా గతంలో భారత జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా ఎన్నో విజయాలను అందించాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో ఏ కెప్టెన్‌కు సాధ్యపడని రీతిలో ముంబై జట్టుకు ఐదుసార్లు టైటిల్‌ను అందించాడు. మరోవైపు వన్డేల్లో భారత్‌ కెప్టెన్‌గా 10 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన రోహిత్… 8 మ్యాచ్‌లలో విజయాలు అందించాడు. అటు అంతర్జాతీయ టీ20లలో టీమిండియా రోహిత్ సారథ్యంలో 19 మ్యాచ్‌లు ఆడగా.. 15 మ్యాచ్‌లలో విజయం సాధించింది. కేవలం నాలుగు మ్యాచ్‌లలో మాత్రమే భారత్ ఓటమి పాలైంది. ఈ రికార్డులు చూసే బీసీసీఐ మేనేజ్‌మెంట్ రోహిత్ వైపు మొగ్గు చూపిందని పలువురు మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు.

Read Also: రూ.50వేలు పరిహారం పొందడానికి ఇలా దరఖాస్తు చేసుకోండి

అటు విరాట్ కోహ్లీ వయసు కంటే రోహిత్ వయసు ఎక్కువ. కానీ యువకులకు అవకాశం ఇవ్వకుండా రోహిత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడానికి ఓ బలమైన కారణముంది. 2022లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్, 2023లో భారత్‌లో వన్డే వరల్డ్ కప్ జరగనున్నాయి. ఈ టోర్నీలకు ఎక్కువ సమయం లేదు. దీంతో ఇప్పటికిప్పుడు యువకులను కెప్టెన్‌గా చేస్తే జట్టు సర్దుకోవడానికి సమయం పడుతుంది. అదే రోహిత్ అయితే జట్టుతో త్వరగా కలిసిపోయి వారితో ఉత్తమ ప్రదర్శన రాబట్టగలడు. కావాలంటే రోహిత్ శర్మ 2023 తర్వాత తన నాయకత్వ బాధ్యతలను కేఎల్ రాహుల్ లేదా పంత్ లేదా శ్రేయాస్ అయ్యర్‌లకు బదిలీ చేయవచ్చు.

Exit mobile version