జనవరి 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ కార్డు లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా గతంలో కస్టమర్ల కార్డు వివరాలను సేవ్ చేసుకోకుండా వ్యాపారులను నియంత్రిస్తూ ఆర్బీఐ మార్గదర్శకాలు తీసుకొచ్చింది.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కార్డు టోకనైజేషన్ సర్వీసులపైనా మార్గదర్శకాలను విడుదల చేసింది ఆర్బీఐ.. వినియోగదారుల సమ్మతితోనే కార్డు డాటా టోకనైజేషన్ ముందుకు సాగాలని అందులో పేర్కొంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. యూనిక్ ఆల్గరిథమ్ జెనరేటెడ్ కోడ్‌తో కార్డు వివరాలను రీప్లేస్ చేసేందుకు టోకనైజేషన్ సహకరిస్తుంది. ముందుగా నిర్ణయం తీసుకున్న ప్రకారం 2022 జనవరి 1వ తేదీ నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి రావాల్సి ఉండగా.. ప్రస్తుతం దానిని వాయిదా వేసింది ఆర్బీఐ.. క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు ఊరట కల్పిస్తూ టోకనైజేషన్ విధానాల అమలును మరో ఆరు నెలలపాటు పొడిగించింది. సీఓఎఫ్ (కార్డ్ ఆన్ ఫైల్ డేటా)ను నిల్వ చేసేందుకు మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నామని.. దీంతో కొత్త టోకెనైజేషన్ పాలసీ 2022 జులై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ఓ ప్రకటనలో పేర్కొంది ఆర్బీఐ.
ఆర్బీఐ తాజా నిర్ణయం వెనుక కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఉంది… టోకనైజేషన్‌ను అమలు చేయడానికి కనీసం 6 నెలల సమయం ఇవ్వాలని ఇటీవలే ట్రేడ్ యూనియన్ వ్యాపారులు కోరారు.. కొత్త రూల్స్ అమలు చేస్తే పలు అంతరాయాలు కలిగే అవకాశం ఉందని.. ఆర్‌బీఐ కొత్త నిబంధనల కారణంగా ఆన్‌లైన్ మర్చెంట్స్ తమ రాబడిని కోల్పోతారని.. దీంతో 20 నుంచి 40 శాతం మేర నష్టపోయే అవకాశం కూడా ఉందని సీఐఐ గతంలోనే పేర్కొంది.. అయితే, 6 నెలల సమయం కోరారు కాబట్టి.. ఇప్పుడు తన నిర్ణయాన్ని అమలు చేయడాన్ని కూడా ఆర్బీఐ 6 నెలలకు వాయిదా వేసింది. ఈ నిర్ణయం ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేవారికి ఊరటగా కూడా చెబుతున్నారు విశ్లేషకులు.