NTV Telugu Site icon

ఏపీ సీఎం జగన్‌కు ఆర్.నారాయణమూర్తి విజ్ఞప్తి

ఏపీలో థియేటర్లు మూసివేస్తుండటంపై ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. నేచురల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ సక్సెస్‌మీట్‌కు ముఖ్య అతిథిగా ఆర్.నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏపీలో టిక్కెట్ రేట్ల వల్ల మూతపడ్డ అన్ని సినిమా థియేటర్లు తెరుచుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్రలో కొన్ని థియేటర్లు మూసివేయడం బాధాకరమన్నారు. సినిమా థియేటర్లు మూసివేయవద్దని యజమానులు, నిర్మాతలను ఆయన కోరారు.

Read Also: మరో రికార్డ్ సృష్టించిన మెగా కోడలు

ఇప్పటికైనా సినిమా పరిశ్రమపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించాలని ఆర్.నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. సినిమా చూసేవాళ్లు బాగుంటేనే సినిమా పరిశ్రమ బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. థియేటర్ల యజమానులకు ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక మంత్రులను కలిసి వాటిని సీఎం జగన్ దగ్గరకు తీసుకువెళ్లాలని సూచించారు. ఎమోషన్ కాకుండా ఈ సమస్యపై పాజిటివ్ దృక్పథంతో ఆలోచించాలని థియేటర్ యజమానులకు హితవు పలికారు. శ్యామ్ సింగరాయ్ సినిమాలో నాని నటన గురించి మాట్లాడేందుకు మాటలు రావడం లేదని ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. సాయిపల్లవిని చూస్తే హీరోయిన్ మాదిరిగా ఉండదని.. మన ఇంటి పక్క అమ్మాయిని చూస్తున్నట్లే ఉంటుందన్నారు.