జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల ధనుష్ తమిళ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న సమయంలో పొరపాటున జారిపడటంతో భుజానికి గాయమైంది. చేతి ఎముక చిట్లడంతో హుటాహుటిన హైదరాబాద్ వచ్చి డాక్టర్ గురవారెడ్డి సమక్షంలో ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. రేపు ఆగస్ట్ 15 దేశ స్వాతంత్ర్య దినోత్సవం! ఆ సందర్భంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ అవకాశం ఉన్నవాళ్ళంతా జెండా ఎగరేస్తారు లేదా ఎవరైనా ఎగరేసిన జాతీయ జెండాకు వందనం చేస్తారు. తాజాగా ప్రకాశ్ రాజ్ ‘జెండా’ ఎగరేస్తాం అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఫిల్మ్ నగర్ లో కొత్త చర్చకు దారితీసింది. ఆయన దీనిని ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవంను ఉద్దేశించి పెట్టి ఉండకపోవచ్చునని, త్వరలో జరుగబోతున్న మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల్లో తాము జెండా ఎగరేస్తామని నర్మగర్భంగా ఇలా తెలిపారని కొందరంటున్నారు. మొత్తం మీద ప్రకాశ్ రాజ్ కొన్ని రోజులుగా సింపుల్ ట్వీట్స్ తో భారీ చర్చలకు తెర తీస్తున్నారు. ఏదేమైనా… ఈసారి జరుగబోతున్న ‘మా’ ఎన్నికలు రంజుగానే ఉండబోతున్నాయి.