Site icon NTV Telugu

నేతలూ.. ఆలోచించండి.. ప్లీజ్.. వీలైతే ఇలా చేయండి..!

సైదాబాద్ ప్రాంతానికి చెందిన చిన్నారిపై.. కామోద్రేకంతో రాజు అనే యువకుడు చేసిన పైశాచికత్వం.. యావత్ దేశాన్ని కదిలిస్తోంది. సామాన్యులనే కాదు.. సమాజంలోని సర్వ శక్తులూ.. ఆ బాధిత కుటుంబం వైపే చూసేలా చేస్తోంది. వారం రోజులుగా.. ప్రతి ఒక్కరూ.. ఆ వార్తనే ప్రసారం చేస్తున్న తీరుతో.. జనాల్లో భావోద్వేగం పెరుగుతోంది. ఈ తీరును గమనించిన రాజకీయ పార్టీల నేతలు సైతం.. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నాం.

ఇక్కడే.. కొందరు ఓ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో.. బాధిత కుటుంబానికి న్యాయం జరగడం అటుంచితే.. సందర్భాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేలా కొందరు ప్రవర్తిస్తున్నారని విమర్శిస్తున్నారు. అది.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల కావచ్చు.. పవన్ కల్యాణ్ కావచ్చు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కావచ్చు. ఎవరైనా సరే. అసలు ఘటన కంటే.. వారి పరామర్శలకు వస్తున్న కవరేజే కాస్త ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నారు.

నిజమే. బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిందే. కచ్చితంగా భరోసా కల్పించాల్సిందే. పవన్ కల్యాణ్ మాదిరిగా.. తోచినంత సహాయాన్ని అందించి.. మేమున్నాం.. తోడుగా నిలుస్తాం.. అని అండగా నిలబడాల్సిందే. కానీ.. పరామర్శకు వెళ్తున్నప్పుడు మరీ జన సమ్మర్థం అయ్యేంతగా.. ముందుగానే ఆ నేతలు మీడియాకు వార్తలు ఇవ్వడం.. తర్వాత బాధితుల ఇంటి దగ్గర జనాలు గుమిగూడడం.. ఏంటిదంతా.. అసలేం జరుగుతోంది.. అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

నేతలు ఎవరైనా సరే. బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే… అభినందించాల్సిందే. కానీ.. మీడియాకు లీకులేవీ లేకుండా.. నేరుగా ఇంటికి వెళ్లి.. పరామర్శించి.. ఓదార్చి.. అనంతరం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే కాస్తైనా హుందాగా ఉంటుందేమో.. అని సామాన్యులు భావిస్తున్నారు. ఈ దిశగా నేతలు ఆలోచిస్తే మంచిదని.. ఇలా హడావుడి కవరేజ్ లతో.. పదే పదే జరిగిన ఘటనను గుర్తు చేసి.. వారిని మరింత బాధపెట్టవద్దన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version