కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం రోశయ్య మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు.. సీఎంలు, మాజీ సీఎంలు, మంత్రులు, నేతలు, సినీ ప్రముఖులు ఇలా అంతా రోశయ్యకు సంతాపాన్ని ప్రకటిస్తూ.. కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు.
- ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య, సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారు అని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
*రోశయ్య మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఎంపీ టీజీ వెంకటేష్.. రోశయ్య అందరి వాడు… దేశంలో రాజకీయాలకు అతీతంగా అభిమానించే నేతల్లో రోశయ్య ఒకరు.. రోశయ్య మృతితో రాజకీయ ధృవతార రాలిపోయింది.. రోశయ్య మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగా పేర్కొన్నారు.
- రోశయ్య మృతి పట్ల తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య ఆత్మకు సద్గతులు కలగాలని, ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. రోశయ్య మరణంతో గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆదర్శవాదిని కోల్పోయామన్నారు. రోశయ్యతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఇంద్రకరణ్‌రెడ్డి.
- టి.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. రోశయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, మాజీ పీసీసీ అధ్యక్షులు రోశయ్య అకాల మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన ఆయన.. రోశయ్య జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం.. నీతి నిజాయితీ, నిబద్ధత, ప్రజా సేవ పట్ల అంకితభావం, సిద్ధాంతాల ఆచరణలో రోశయ్య పెట్టింది పేరు.. రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు రేవంత్‌రెడ్డి.
- కొణిజేటి రోశయ్య మృతికి సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. మంత్రిగా, ముఖ్య మంత్రిగా, గవర్నర్ గా అనేక పదవులు అలంకరించారు. మంచి మాట కారి అయిన ఆయన, తనదైన నుడికారం, వ్యంగమైన వ్యాఖ్యలతో అందరి మన్ననలు పొందారు. సుదీర్ఘంగా వ్యక్తిగత, రాజకీయ, సంపూర్ణ జీవితాన్ని అనుభవించారు. వారు లేని లోటు తీర్చలేనిది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాని పేర్కొన్నారు.
- ఎంతో గొప్ప వ్యక్తిత్వం.. ఎన్నో పదవులు.. ఉత్తమ విలువలతో.. ఆ పదవులకే వన్నె తెచ్చిన రాజకీయ దురంధరుడు రోశయ్య గారు అని గుర్తుచేశారు సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు.. నా సంతాపం తెలుపుతూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు తెలిపారు రాఘవేంద్ర రావు.
- రాజనీతిజ్ఞుడు, అపర చాణిక్యుడు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు సంతాపం ప్రకటించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి… రోశయ్య మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆమె.. రోశయ్య గారి మరణం తెలుగు రాష్ట్రాలకి తీరనిలోటని పేర్కొన్నారు.. రోశయ్య గారి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన రోజులను సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు సబిత.
- కొణిజేటి రోశయ్య మరణం పట్ల వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. రోశయ్య పేరు వింటేనే ఆర్థిక శాఖ గుర్తుకు వస్తుందని, ఆ పదవికి ఆయన అంతలా పేరు తెచ్చారని అన్నారు. సౌమ్యుడిగా, నిరాడంబరుడిగా జీవించి అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు నిరంజన్‌రెడ్డి.
- రోశయ్య మృతి బాధాకరం అన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ శైలజానాథ్.. కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటని, రోశయ్య ఆత్మకు సద్గతులు కలగాలని, ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. రోశయ్య మరణంతో గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆదర్శవాదిని కోల్పోయామని శైలజానాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. రోశయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రోశయ్య అజాత శత్రువుగా రాజకీయాలలో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడని, పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా పేరుప్రఖ్యాతులు గడించారన్నారు. విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి అంచలంచెలుగా ఎదిగారన్నారు. వివాదరహితుడిగా నిలిచారని తెలిపారు. తనకప్పగించిన ఏ బాధ్యతలనైనా సమర్థవంతంగా నిర్వహించేవారని కొనియాడారు. సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగి తన సేవలనందించారన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు శైలజానాథ్.
- కొణిజేటి రోశయ్య మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.. ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేత, రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడం లో ఓ రుషి మాదిరిగా సేవ చేశారు.. రోశయ్య కన్నుమూయడంతో రాజకీయాలలో ఓ శకం ముగిసింది.. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, నన్ను రాజకీయాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానించారని.. వివాదరహితులుగా, నిష్కళింకితులుగా ప్రజమన్ననలు పొందిన వ్యక్తి రోశయ్య అని గుర్తుచేసుకున్నారు చిరంజీవి.
- రోశయ్య మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.. మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. అనేక మంది రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శంగా నిలిచారు.. అవినీతి మచ్చలేని నిఖార్సయిన రాజకీయ నేత రోశయ్య గారు.. 16 సార్లు రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత రోశయ్య గారిది.. ఆయన మరణం ఉమ్మడి రాష్ట్రానికి తీరని లోటుగా పేర్కొన్నారు.
- కొణిజేటి రోశయ్య మృతికి సంతాపం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ… వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. ఇక సోషల్ మీడియా వేదికగా రోశయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.
- పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా రోశయ్య పేరు ప్రఖ్యాతులు గడించారని పేర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి అంచలంచెలుగా ఎదిగారు.. తనకప్పగించిన ఏ బాధ్యతలనైనా సమర్థవంతంగా నిర్వహించేవారు.. సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగి సేవలనందించారని గుర్తుచేశారు చంద్రబాబు.
- స్వాతంత్ర్య యోధుడు, రాజకీయ చతురత కలిగిన నాయకుడు రోశయ్యగారు మరణం అత్యంత బాధాకరం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.. రోశయ్య గారికి భగవంతుడు ఆత్మ శాంతి ప్రసాధించాలని ప్రార్ధిస్తున్నాను, వివాదరహితుడుగా రాజకీయాల్లో ఒక గుర్తింపు పొందిన నాయకుడు రోశయ్య, రాజకీయాల్లో ఎందరికో మార్గదర్శకుడుగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు అర్ధం చేసుకొని బడ్జెట్ రూప కల్పన చేసిన రోశయ్య, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి అంటూ పేర్కొన్నారు మంత్రి ఆళ్ల నాని.
- రోశయ్య మృతికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేతలు సోము వీర్రాజు, సుజనా చౌదరి, సీఎం రమేశ్ సంతాపం ప్రకటించారు.
- రోశయ్య అకాల మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్.. రాజకీయ చతురత కలిగిన సీనియర్ నాయకుడు రోశయ్య మరణం అత్యంత బాధాకరం.. దివంగత నేత వైస్ రాజశేఖరరెడ్డి గారికి అత్యంత సన్నిహితులు రోశయ్య.. ఆయన ఆత్మకు శాంతి ప్రసాధించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులకు తగ్గట్టు బడ్జెట్ రూప కల్పన చేసిన వ్యక్తి రోశయ్య.. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు పేర్కొన్నారు మంత్రి సురేష్.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నరుగా పనిచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యదక్షుడు, సౌమ్యత, విషయ స్పష్టతతో ఏ పనినైనా నిబద్ధతతో చేసే రోశయ్య గారు ఇక లేరు అనే వార్త నన్ను బాధించింది, రోశయ్య గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను అని పేర్కొన్నారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.
- మృదు భాషి రోశయ్య.. అందరినీ కలుపుకొని ముందుకు పోగలిగిన నాయకుడు.. అందిరి క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పని చేసిన వ్యక్తి. రాష్ట్ర ముఖ్యమంత్రి(2010) APCC అధ్యక్షుడు గా (1994-96) అందరి ప్రసంశలు పొందిన నాయకుడు.. మంచి పార్లమెంటేరియన్. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్.
- పెద్దలు రోశయ్య గారి మరణవార్త నన్నెంతగానో బాధించిందని పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్… ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా… సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని.. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని జగన్ పేర్కొన్నారు.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.. ఆయన మరణంతో తెలుగునేల ఒక గొప్ప రాజనీతిజ్ఞులను కోల్పోయింది అన్నారు.. ఆయన మంత్రివర్గంలో తాను పని చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి బొత్స గుర్తుకు తెచ్చుకున్నారు.. నిరాండబరుడు, నిగర్వి అయిన రోశయ్య గారు లేని లోటు తీర్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్దిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు మంత్రి బొత్స.
- రోశయ్య మృతికి నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు.. రోశయ్యగారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన.. సమయస్ఫూర్తికి, చమత్కార సంభాషణలకు రోశయ్య మారుపేరు.. అత్యధిక బడ్జెట్ లు ప్రవేశపెట్టిన ఆర్ధికమంత్రిగా రోశయ్య పేరొందారు.. చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారు.. రోశయ్య మృతితో గొప్ప అనుభవంగల నాయకుడిని తెలుగుజాతి కోల్పోయింది.. కంచుకంఠం, నిండైన రూపం, పంచెకట్టుతో తెలుగు సంప్రదాయానికి ప్రతీకగా ఉండేవారని తెలిపారు నందమూరి బాలకృష్ణ.
- మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన హోంమంత్రి మేకతోటి సుచరిత.. కొణిజేటి రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆమె.. రాజకీయంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన రోశయ్య మనమధ్య లేకపోవడం తీరనిలోటన్నారు.. రోశయ్య గారి పవిత్రఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు హోంమంత్రి సుచరిత.
- రోశయ్య మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి.. కొన్ని శతాబ్దాలు పాటు రాష్ర్టానికి ఎనలేని సేవలు రోశయ్య చేసారు.. వారి కుటుంభసభ్యులుకు తీవ్ర సంతాపం తెలుపుతున్నానని పేర్కొన్నారు.
- స్వాతంత్ర సమర యోధుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య మృతి పట్ల రాష్ట్ర మంత్రి శ్రీరంగనాథ రాజు తీవ్ర దిగ్భ్రింతి వ్యక్తం చేశారు.. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, వరుసుగా 7సార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టడంతో పాటు, అనేక శాఖలు నిర్వహించిన బహుముఖ ప్రజ్ఞాశీలి రోశయ్య అని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఎంతో ప్రతభాశీలి అయిన ఒక నాయుకుడిని కోల్పయామని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను అన్నారు శ్రీరంగనాథరాజు.
