హుజూరాబాద్ ఉప ఎన్నికపై అధికార పార్టీ ఫోకస్ పెంచింది. టైమ్ దగ్గరవుతున్నందున అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎవరో ఇప్పటికే తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది ఎవరన్నది కూడా దాదాపు ఫైనల్ అయింది. హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ కోసం రేవంత్ వెయిటింగ్. కాగా బరిలో తామూ ఉంటామని వైఎస్ షర్మిల ఇటీవలే ప్రకటించారు. దాంతో వైఎస్సార్‌టీపీ అభ్యర్థి కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో ఉంటారని తేలిపోయింది. ఇక బీఎస్పీ ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఒక వేళ ఆ పార్టీ తన అభ్యర్థిని బరిలో దించితే రాజకీయ లెక్కలు మారే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.
ఎంతమంది బరిలో ఉన్నా మూడు ప్రధాన పార్టీలకు హుజూరాబాద్ ప్రతిష్టాత్మకంగా మారింది. ముఖ్యంగా బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య రసవత్తర పోరు ఖాయం. అనేక సమీకరణలతో ఈ ఎన్నికల ప్రచారం జరుగుతోంది. హుజురాబాద్ లో తనను ఓడించే దమ్ము ఎవరికీ లేదంటున్నారు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. ఓటుకు లక్ష రూపాయలు ఇచ్చినా హుజురాబాద్‌లో గెలుపు తనదే అన్నది ఆయన ధీమా. అన్ని వర్గాల ప్రజలు తనవెంటే ఉంటారని బలంగా నమ్ముతున్నారు. కేసీఆర్ నియంతృం, అహంకారం, రాచరికపు పోకడలు హుజూరాబాద్‌లో ఓడిపోక తప్పదంటున్నారు ఈటెల.
ఇదిలావుంటే, ఈటెల ప్రధాన అనుచరులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. కాషాయ పార్టీలో ఇమడలేకనే బయటకు వెళ్లిపోతున్నారు. తాజాగా ఆయనకు అత్యంత సన్నిహితుడు కరీంనగర్ జిల్లా కోఆపరేటివ్ కమర్షియల్ బ్యాంక్ డిప్యూటీ చైర్మన్ పింగళి రమేష్, ఎంపీపీ చుక్క రంజిత్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ భావజాలంతో ఇమడలేకే ఈ నిర్ణయం తీసుకున్నారని వారే స్వయంగా చెప్పారు. అంతేకాదు వారు వారు తిరిగి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు.
ముందు ముందు హుజూరాబాద్ ఉపఎన్నికలకు సంబంధించి పలు ఆసక్తికర పరిణామాలకు అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ టీఆర్‌ఎస్, బీజేపీలనే ప్రధానంగా చూస్తున్నారు ప్రజలు. కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించే పనిలో ఉంది. అయితే ఇప్పుడు బీఎస్పీ పేరు కూడా వినిపిస్తోంది. పోటీ చేయాలంటూ మెజార్టీ పార్టీ నేతలు ప్రవీణ్ కుమార్‌పై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.కానీ ఆయన ఏ విషయం తేల్చుకోలేకపోతున్నారు. ఇంకా సమయం ఉన్నందున దీనిపై ఆచి తూచి నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు, ఈనెల 26న కరీంనగర్‌లో జరిగే సభలో దీనిపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందంటున్నారు ఆ పార్టీ వర్గాలు. ఒక వేళ ఆయన పోటీలో ఉంటే గనక సమీకరణాలు మారిపోతాయి. బడుగు బలహీన వర్గాల్లో ఆయనకు ఆదరణ ఉంది. ఈ వర్గాలకు చెందిన విద్యావంతులు ఆయన పట్ల ఆకర్షితులయ్యే అవకాశం వుంది.
హుజూరాబాద్ దళిత ఓట్ల చుట్టే ఇప్పుడు రాజకీయం నడుస్తుందనటం ఓపెన్ సీక్రెట్. అధికార పార్టీ దళితబంధును తెరమీదకు తెచ్చింది. ఇక్కడ దళితుల జనాభా 50 వేల పైమాటే. అధికారిక లెక్కల ప్రకారం హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 20,929 దళిత కుటుంబాలు ఉన్నాయి, ఇందులో హుజురాబాద్ మండలంలో 5,323, కమలాపూర్ మండలంలో 4,346, వీణవంక మండలంలో 3,678, జమ్మికుంట మండలంలో 4,996 , ఇల్లంతకుంట మండలంలో 2,586 కుటుంబాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ రంగంలో ఉంటే టీఆర్ఎస్,బీజేపీలకు అది పెద్ద సవాలుగా పరిణమిస్తుంది. ఒక వేళ ఆయన రంగంలో లేకపోతే పరిస్థితి ఏమిటి? ఆయన మద్దతు ఎవరికి అన్నదాని మీద కూడా చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ కా, బీజేపీ కా అన్నది ఆయన ముందుండే ప్రశ్న. ఈటెల, రేవంత్ ఇద్దూ ఆయన తమ వాడని అంటున్నారు. ప్రవీణ్ కుమార్ ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపిస్తున్నందున టీఆర్‌ఎస్ కు మద్దతిచ్చే ప్రసక్తే ఉండకపోవచ్చు.
మరోవైపు, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడతగా 500 కోట్లు విడుదల చేసింది. ఆగస్టు 9 న మొదటి విడతగా 500 కోట్లు రిలీజ్ చేశారు. ఈ పైలెట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇవ్వనుంది. ఇందుకోసం 2,000 కోట్లు కేటాయించారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు వెయ్యి కోట్లు రిలీజ్ చేవారు. మిగతా వెయ్యి కోట్లు వారంలో విడుదల కానుంది. రెండు వారాల్లో రెండు వేల కోట్లు విడుదల చేస్తామని ఆగస్టు 16 న హుజురాబాద్‌లో బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాటిచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని నియోజకవర్గ దళితుల మనసులు గెలుచుకుంటున్నారు గులాబీ దళపతి. మరి కారు జోరును కమల దళం ఎలా అడ్డుకుంటుందో చూడాలి.