కొంత కాలంగా తెలంగాణ రాజకీయం ఇప్పుడు హుజురాబాద్ చుట్టే తిరుగుతోంది. ఉప ఎన్నిక సమయం సమీపిస్తోంది. ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ప్రచారం కూడా రోజు రోజుకు ఊపందుకుంటోంది. ఏ ఒక్క ఓటరునూ నిర్లక్ష్యం చేయరాదని ప్రధాన పార్టీలు బావిస్తున్నాయి. అంది వచ్చిన అన్ని అవకాశాలను వాడుకుంటున్నారు.
మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు బతుకమ్మ వేడుకలనూ వదలట్లేదు పార్టీలు. బతుకమ్మ పాటల్లో ఎన్నికల వేడిని రగిలిస్తున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. దొంగ బీజేపీ ఉయ్యాలో.. గ్యాస్ ధరలను పెంచి ఉయ్యాలో… మమ్మల్ని ఆగం చేస్తుంది ఉయ్యాలో అంటూ బీజేపీ ప్రభుత్వ తీరుని ఎండగట్టారు మహిళలు. టీఆర్‌ఎస్ వారే కాదు ప్రత్యర్థి పార్టీలు కూడా ఈ తరహాలోనే సెటైర్లు వేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారం సందర్భంగా బతుకమ్మ కార్యక్రమానికి హాజరై మహిళలతో ముచ్చటిస్తున్నారు.
నిజానికి గత నాలుగైదు నెలలుగా తెలంగాణ రాజకీయాలకు హుజురాబాద్ కేంద్ర బింధువుగా ఉంది. గత జూన్‌లో ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కింది. అధికార టీఆర్‌ఎస్ ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందరి కన్నా ముందు అభ్యర్థిని ప్రకటించింది. ప్రచారం ముమ్మరం చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దించింది. ప్రభుత్వ పథకాలకు నిధుల వరద పారించింది. దాంతో హుజూరాబాద్ ఉప ఎన్నికల నువ్వా నేనా అన్నట్టుగా మారింది.
బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రచారం కూడా ఉధృతంగా సాగుతోంది. అలాగే ఆ పార్టీల ఎన్నికల సమావేశాలకు జనం భారీగా తరలుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ రాజేందర్ మీటింగ్‌లకు..అటు టీఆర్‌ఎస్ సభలకూ మంచి స్పందన ఉంది. దాంతో ఓటరు నాడి తెలుసుకోవటం కష్టంగా ఉంది. ఎవరిని అడిగినా స్పష్టమైన సమాధానం రావట్లేదు. కొందరు ఈటల అంటే..కొందరు కేసీఆర్ అంటున్నారు. దాంతో గెల్లు శ్రీనివాస్ గెలుస్తాడా ? ఈటల రాజేందర్ గెలుస్తాడా ?.. అన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. నియోజకవర్గంలో ఇది చర్చనీయాంశంగా మారింది .
సమయం గడిచే కొద్దీ ఈ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. భవిష్యత్‌లో తెలంగాణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్న హుజూరాబాద్ ఉపఎన్నిక విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తునన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించటమే గాక ..స్థానికేతరుడిని బరిలో దించటమే ఈ అనుమానాలకు తావిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అందుకే కాంగ్రెస్ ఈ ఎన్నికపై చేతులెత్తేసిందని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూ రి వెంకట్ ఇంతవరకు నియోజకవర్గం ముఖం చూడలేదు. ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియడంలేదు. దీంతో పార్టీకి చెందిన పలువురు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. దీంతో హుజూరాబాద్ కాంగ్రెస్ నాయకులు సొంత నిర్ణయాలతో ముందుకుసాగే అవకాశం కలిగిస్తోంది. ఇప్పటికైనా ఆ పార్టీ ప్రచార వేగం పెంచుతుందో లేదో చూడాల్సివుంది.
మరోవైపు, ఈ ఎన్నికల్లో నిరుద్యోగులే అధికార పార్టీ కొంపముంచేలా ఉన్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించాలని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఓటర్ల చెంతకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఓటర్లకు దండం పెడుతూ, వారిని బతిమాలుతూ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. ముందు ముందు హుజురాబాద్ ఉప ఎన్నికల ఘట్టం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సివుంది.