NTV Telugu Site icon

ఒమిక్రాన్ పట్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన… ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలందరూ తప్పకుండా మాస్కు ధరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కరోనాను భారత్ సమర్థంగా ఎదుర్కొంటోందని స్పష్టం చేశారు. మనమంతా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది అని మోదీ అన్నారు. దేశంలో సరిపడా ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా 18 లక్షల ఐసోలేషన్ బెడ్లు, 5 లక్షల ఆక్సిజన్ బెడ్లు రెడీగా ఉన్నాయని చెప్పారు. కోటి 40 లక్షల ఐసీయూ బెడ్లు ఉన్నాయన్నారు. పిల్లల కోసం కూడా 90వేల బెడ్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

దేశంలో ఈ ఏడాది జనవరి 26న కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైందని.. ప్రపంచ దేశాలతో పోలిస్తే వ్యాక్సినేషన్‌లో భారత్ ముందుందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో 141 కోట్ల కరోనా టీకా డోసులు పూర్తయ్యాయన్నారు. కరోనాపై పోరాడేందుకు వ్యాక్సిన్ ఒక ఆయుధం అని అన్నారు. అనేక రాష్ట్రాల్లో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యిందన్నారు. వైద్య సిబ్బంది కఠోర శ్రమ వల్లే వందశాతం వ్యాక్సినేషన్‌ సాధ్యమైందని మోదీ అభిప్రాయపడ్డారు. పాఠశాలకు వెళ్లే పిల్లలకు వ్యాక్సిన్ వేయడం వల్ల తల్లిదండ్రులకు భరోసా వస్తుందన్నారు.