తన సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావడం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. 2014లో ఓట్లు చీల్చకూడదనే తాను పోటీ చేయలేదన్నారు. ఇప్పుడు 2024 ఎన్నికలు వచ్చేంత వరకు భరించక తప్పదన్నారు. తాము అధికారంలోకి వస్తే వైసీపీ తప్పులకు సమాధానం చెప్పిస్తామన్నారు. సిగరెట్లు తాగితే ఆరోగ్యానికి హానికరం అన్నట్టుగా.. ఏపీలో ప్రజల ఆరోగ్యానికి వైసీపీ హానికరమని పవన్ ఆరోపించారు. ఏపీలో తమ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటే వాళ్ల తరఫున నిలబడతామని, లేదంటే ఆ తర్వాత జరిగే వాటికి తాను ఏమీ చేయలేను అని పవన్ వ్యాఖ్యానించారు.
Read Also: చేతకాని వైసీపీ ఎంపీలు చట్టసభల్లో దేనికి?: పవన్ కళ్యాణ్
తన సినిమాలను ఆపేసి ఆర్థికంగా దెబ్బకొట్టాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని.. తన సినిమాలను ఆపేస్తే భయపడేంత పిరికివాడిని కాదని పవన్ స్పష్టం చేశారు. పంతానికి దిగితే తన సినిమాలను ఏపీలో ఉచితంగా ఆడిస్తానని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టిక్కెట్లల్లో పారదర్శకత లేదని అంటున్నారు.. మరి ప్రభుత్వం చేసే మద్యం వ్యాపారంలో పారదర్శకత ఉందా అని పవన్ ప్రశ్నించారు. రూ.700తో మద్యం తాగి రూ. 5లతో సినిమా టిక్కెట్ కొనుక్కుని వెళ్తే ప్రభుత్వానికి సంతోషంగా ఉంటుందని ఎద్దేవా చేశారు. మరోవైపు వైసీపీ నేతలు అధికారంలో ఉండి స్టీల్‌ప్లాంట్‌తో తమకు సంబంధం లేదంటే ఎలా అన్నారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని వైసీపీ ఎందుకు ప్రచారం చేసిందని పవన్ నిలదీశారు. ప్రైవేటీకరణను ఆపుతామనే అజెండాతో కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఓట్లు ఎందుకు వేయించుకున్నారని ఆయన మండిపడ్డారు.