NTV Telugu Site icon

పాపికొండలు పిలుస్తున్నాయ్.. పద పద

గోదావరి నదిలో విహారం ఎంతో ఆహ్లాదంగా వుంటుంది. అందులోనూ పాపికొండల అందాలకు ముగ్ధులవ్వని పర్యాటకులు వుండరు. చాలాకాలంగా పాపికొండలకు వెళ్ళాలనుకునేవారికి నిరాశే కలిగింది. అయితే పరిస్థితులు మారడంతో ప్రభుత్వం పాపికొండల టూర్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేటి నుంచి పాపికొండల సందర్శనకు పర్యాటకులకు అనుమతి మంజూరు చేసింది.

రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభం అవుతున్నాయి టూరిజం బోట్లు. రాజమండ్రి నుంచి వర్చువల్ గా పాపికొండల బోట్లను ప్రారంభించనున్నారు టూరిజం మంత్రి అవంతి శ్రీనివాసరావు. పాపికొండల విహారయాత్ర పర్యవేక్షణకు ఐదు కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. ప్రతి పర్యాటక బోట్లకు ఎస్కార్ట్ బోట్ తప్పని సరిచేసింది ప్రభుత్వం. నిబంధనలకు విరుద్ధంగా నడిచే బోట్లకు కళ్ళెం పడింది.

రెండేళ్ల కిందట కచ్చులూరు ఘటన తీవ్రవిషాదం నింపింది. దీంతో యాత్ర నిలిచిపోయింది. ఈ ఏడాది పునఃప్రారంభించారు. వరదల కారణంగా కొంతకాలం ఆగిన పాపికొండలు విహారయాత్ర ఆదివారంనుంచి ప్రారంభం అవుతోంది. దీంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పాపికొండల యాత్రకు వెళ్లాలంటే ఏపీ టూరిజం ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా టికెట్లు తీసుకోవాలి. సొంత వాహనాలు లేని సందర్శకులు రాజమహేంద్రవరం సరస్వతీఘాట్‌లో ఉన్న పర్యాటక శాఖ కార్యాలయానికి ఉదయం 6.30కు చేరుకోవాలి. పర్యాటకులను అక్కడినుంచి గండిపోచమ్మ బోటింగ్‌ పాయింట్‌ వరకు వాహనంలో తీసుకెళ్తారు. యాత్ర అక్కడినుంచే మొదలవుతుంది.

యాత్ర ఎలా సాగుతుందంటే..
పాపికొండల యాత్ర అంటే ఎంతో ఆసక్తి. ప్రతి ఒక్కరూ ఈ యాత్రకు వెళ్ళాలని ఉవ్విళ్ళూరుతారు. ఉదయం అల్పాహారం, బోటులోనే మధ్యాహ్న భోజనం అందిస్తారు. బోటింగ్‌ చివరి పాయింట్‌ పేరంటాలపల్లి. అక్కడ అరగంట విరామం ఇస్తారు. తిరిగి అదే మార్గంలో గండిపోచమ్మ కంట్రోల్‌రూమ్‌కు బోటు చేరుకుంటుంది. అక్కడినుంచి పర్యాటకులను తిరిగి ఉదయం ప్రారంభమైన ఏపీ టూరిజం కార్యాలయానికి సాయంత్రం ఏడింటికి చేరుస్తారు.

టికెట్ ధరలు…

పెద్దలకు రూ.1250, పిల్లలకు రూ.1050. ఈ టికెట్‌ ధరలోనే అల్పాహారం, భోజనం, సాయంత్రం స్నాక్స్‌ అన్నీ కలిపి వుంటాయి. తెలంగాణ నుంచి వచ్చే పర్యాటకులు పోచవరం కంట్రోల్‌పాయింట్‌ ద్వారా పాపికొండలు విహారయాత్రకు వెళ్లవచ్చు. పాపికొండలు యాత్రకు టికెట్ల కోసం aptdc.in ద్వారా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలి. సరాసరి టికెట్లు కొనాలంటే వివిధ ప్రాంతాల్లో ఏపీటీడీసీ కార్యాలయాల్లో సంప్రదించవచ్చు. పర్యాటకశాఖతో పాటు ప్రైవేటువి కలిపి మొత్తం 11 బోట్లకు అనుమతులిచ్చారు.

పర్యాటక శాఖ 40 మంది ప్రయాణికులు వెళ్లడానికి వీలుగా సర్‌ ఆర్ధర్‌కాటన్‌ బోటు అందుబాటులో ఉంది. త్వరలో 90 సీట్ల సామర్థ్యమున్న హరిత బోటు అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. పర్యాటకులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులు, సిబ్బంది సూచించిన విధంగా వ్యవహరించాలి. మీకూ పాపికొండలు చూడాలని వుందా.. పదండి మరి.