NTV Telugu Site icon

నేడు పాక్ కు భంగపాటు తప్పదా…?

అంతర్జాతీయ వేదికల్లో ఆధిపత్యం చెలాయించిన పాక్‌…ప్రపంచకప్‌లో మాత్రం భారత్ చేతిలో భంగపాటు తప్పడం లేదా ? టీ20 వరల్డ్‌ కప్‌లో…ఐదు మ్యాచ్‌లు జరిగితే…భారత్‌ తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది. రెండు జట్ల బ్యాటింగ్‌, బౌలింగ్‌లో కీలక ఆటగాళ్లు ఎవరు ? అన్ని విభాగాల్లోనూ కోహ్లీ సేన పటిష్టంగా ఉందా ?

కొన్నేళ్ల క్రితం వరకు ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగాయి. అయితే ఉగ్రవాదాన్ని పాక్‌ ప్రోత్సహిస్తుండడంతో… ఆ ప్రభావం ఇరు దేశాల క్రీడలపైనా పడింది. పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు భారత్‌ నిరాకరించడంతో… ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లు జరగలేదు. మిగిలిన జట్లు కూడా పాకిస్తాన్‌కు వెళ్లినా….మ్యాచ్‌లు ఆడకుండానే వెనుదిరిగాయ్. కొన్నేళ్ల కిందట వరకు ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగాయి. అయితే ఉగ్రవాదాన్ని పాక్‌ ప్రోత్సహిస్తుండడంతో ఆ ప్రభావం ఇరు దేశాల క్రీడలపైనా పడింది. పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు భారత్‌ నిరాకరించడంతో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లు నిలిచిపోయాయి.

క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి ఇరు జట్లు 199 మ్యాచ్‌ల్లో ఢీకొనగా.. భారత్‌ 70 మ్యాచుల్లో విజయం సాధించింది. పాకిస్థాన్‌ 86 విజయాలను నమోదు చేసింది. మరో 42 మ్యాచ్‌లు ఫలితం తేలకుండానే ముగిశాయి. ఇందులో 59 టెస్టులు ఆడగా.. భారత్‌ 9, పాకిస్థాన్‌ 12 మ్యాచుల్లో విజయం సాధించాయి. 38 మ్యాచులు డ్రాగా ముగిశాయి. అలానే 132 వన్డేల్లో టీమిండియా 55, పాకిస్థాన్‌ 73 మ్యాచుల్లో గెలుపొందగా.. నాలుగు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. టీ20ల్లో మాత్రం భారత్‌దే తిరుగులేని రికార్డు

ప్రస్తుత టీమిండియా పాకిస్థాన్‌ కన్నా అన్ని విభాగాల్లో బలంగా ఉంది. బ్యాటింగ్‌లో ప్రపంచంలోని ఏ జట్టుకు తీసిపోని విధంగా సీనియర్లు, జూనియర్లు రెచ్చిపోతున్నారు. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్లతో ఆడిన రెండు వార్మప్‌ మ్యాచ్‌ల్లోనూ ఇదే విషయం స్పష్టమైంది. మరోవైపు ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లో భారత ఆటగాళ్లంతా జోరు చూపించారు. సన్నాహక మ్యాచ్‌ల్లో రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ లాంటి ఆటగాళ్లు తమ బ్యాటింగ్‌ పవర్‌ చూపించి పాకిస్థాన్‌తో కీలకపోరుకు ముందు ఫామ్‌లోకి వచ్చారు.

ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ చివరిసారి ఫర్వాలేదనిపించినా జట్టును విజయతీరాలకు చేర్చలేక మరోసారి నిరాశపరిచాడు. మొత్తం 15 మ్యాచ్‌లు ఆడి 3 అర్ధశతకాలతో 405 పరుగులు చేశాడు. సగటు 28.92గా నమోదవ్వగా స్ట్రైక్‌రేట్‌ 119.46 సాధించాడు. ముంబయి కెప్టెన్‌గా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సైతం ఏమంత చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. 13 మ్యాచ్‌లు ఆడి రెండు అర్ధశతకాలతో 381 పరుగులు చేశాడు. అతడి సగటు 29.30గా నమోదవ్వగా స్ట్రైక్‌రేట్‌ 127.42గా ఉంది. ప్రపంచకప్‌ లాంటి మెగా ఈవెంట్‌లో ఎ జట్టుకైనా ఓపెనర్లే కీలకం కాబట్టి.. ఈ హిట్‌మ్యాన్‌ చెలరేగకపోతే భారత్‌కు కష్టాలు తప్పవనే చెప్పొచ్చు.

ఐపీఎల్‌ సీజన్‌లో అదరగొట్టిన బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ అని కచ్చితంగా చొప్పొచ్చు. జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లకపోయినా తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. తన ఆటతో బౌలర్ల దుమ్ముదులిపాడు. మొత్తం 13 మ్యాచ్‌లు ఆడిన రాహుల్‌ 62.60 సగటుతో 626 పరుగులు చేశాడు. అందులో ఆరు అర్ధశతకాలు ఉన్నాయి. ఇక స్ట్రైక్‌రేట్‌ కూడా 138.80 మెరుగ్గా ఉంది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో చెలరేగి బ్యాటింగ్‌ చేశాడు. ఈ సీజన్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఇషాన్‌ కిషన్‌ చివర్లో రెండు మ్యాచ్‌ల్లో ఉతికారేశాడు. మరోవైపు ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లోనూ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో దంచికొట్టాడు.

హార్దిక్‌ పాండ్య, రిషభ్‌ పంత్‌ చెలరేగితే టీమిండియాకు తిరుగుండదు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ తుదిజట్టులో స్థానం కోసం పోటీపడుతున్నారు. అయితే జడేజాకు 11 మందిలో చోటు దక్కే ఛాన్స్‌ ఉంది. ఐపీఎల్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించాడు. అతడికి తోడుగా మరో స్పిన్నర్‌ ఎంపికైనా లేక శార్దూల్‌ ఠాకూర్‌ను తీసుకున్నా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. చివరగా బౌలింగ్‌లో జస్ప్రిత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరోవైపు పాకిస్థాన్‌ జట్టులో నలుగురైదుగురు మినహాయిస్తే మిగతా ఆటగాళ్ల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌, కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌, ఫకర్‌ జమాన్‌ మాత్రమే టాప్‌ ఆర్డర్‌లో పరుగులు చేస్తూ ఫామ్‌లో ఉన్నారు. టీమ్‌ఇండియా వీరిని కట్టడి చేస్తే పాకిస్థాన్‌ భారీ స్కోర్‌ చేయకుండా అడ్డుకునే వీలుంది. బౌలింగ్‌లో షాహీన్‌ అఫ్రిది ఒక్కడే కాస్త ఫరవాలేదనిపిస్తున్నాడు. బౌలింగ్లో హారిస్‌ రౌఫ్‌, హసన్‌ అలీ ఎప్పుడెలా బంతులేస్తారో అర్థం కాని పరిస్థితి. దీంతో కోహ్లీసేన వీరిపై ఆధిపత్యం చలాయిస్తే పరుగుల వరద పారించొచ్చు.

అందుకు ఇటీవల పాక్‌ ఆడిన రెండు వార్మప్‌ మ్యాచ్‌లే నిదర్శనం. వెస్టిండీస్‌పై సునాయాస విజయం సాధించిన ఆ జట్టు దక్షిణాఫ్రికాతో భారీ స్కోర్‌ సాధించినా ఓటమిపాలైంది. పాక్‌ బౌలర్లను సఫారీలు దంచికొట్టారు. దీంతో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ సైతం తొలి మ్యాచ్‌లో రెచ్చిపోతే పని తేలికవుతుంది. అయితే, పాక్‌ను తేలిగ్గా తీసుకుంటే పొరపాటే. తమదైన రోజు ఆ జట్టు ఎంతటి గొప్ప జట్టునైనా ఓడించగలదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ ఎంత బాగా ఆడితే అంత మంచిది. మరోవైపు దక్షిణాఫ్రికాతో ఓటమిపాలవ్వడం పాక్‌ ఆటగాళ్లపై కాస్త ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా లాంటి మేటి జట్లపై విజయం సాధించిన టీమ్‌ఇండియా అదే ఆత్మవిశ్వాసంతో పాక్‌ను ఓడించేలా పటిష్ఠంగా కనిపిస్తోంది.