బిజెపి నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష శక్తులను ఏకం చేసే పనిని స్వయంగా తీసుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవనున్నారు. మోడీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా బిహార్ సీఎం నితీష్ వివిధ పార్టీల నేతలను కలుస్తున్నారు. ఇప్పటికే పలువురు విపక్ష నేతలను కలిశారు. జాతీయ స్థాయిలో పార్టీలను ఏకం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో గత నెలలో కోల్‌కతాలో మమతా బెనర్జీని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కలిశారు. 2024 ఎన్నికలకు ముందు సీఎం మమతా బెనర్జీ ఇతర పార్టీలతో నేతల వరుస భేటీలు అవుతున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ్టి మమతా బెనర్జీ, నితీష్ కుమార్ ల భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. బీజేపీని ఎలా ఎదుర్కోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాని అనే అంశంపై ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది.
Also Read:CM Jaganmohan Reddy Tour: ఈనెల 26న సీఎం జగన్ అనంతపురం జిల్లా టూర్
ప్రతిపక్షాల ఐక్యత కోసం ఆయన గత ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ ఎంపీ రాహుల్ గాంధీలతో చర్చలు జరిపారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు మహా ప్రతిపక్ష కూటమికి పునాది వేయడానికి ఈ సమావేశం ప్రధాన అడుగుగా భావిస్తున్నారు. ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, జనతాదళ్-యునైటెడ్ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ (లలన్) సింగ్ కూడా పాల్గొన్నారు. సమావేశం అనంతరం రాహుల్ విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షాల ఐక్యతకు, సైద్ధాంతిక పోరాటానికి ఇదో చారిత్రాత్మక అడుగు అని అన్నారు. తాము కలిసికట్టుగా ఉన్నామని, భారత్ కోసం కలిసి పోరాడుతామని చెప్పారు.