ప్రపంచాన్ని ఒమిక్రాన్ వణికిస్తోంది. కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే ఆర్ధికంగా దేశాలు కుదుటపడుతున్నాయి. ఈ తరుణంలో మరోసారి ఒమిక్రాన్ భయం నెలకొనడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఒమిక్రాన్ యూరప్‌లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే బ్రిటన్‌లో ఒమిక్రాన్ కేసులు లక్ష దాటిపోయాయి. బ్రిటన్‌లో ప్రతి 25 మందిలో ఒకరు కరోనా బారిన పడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, మరో యూరప్ దేశమైన ఫ్రాన్స్‌లోనూ ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతున్నాయి.
Read: ఎకానమీ: 2033 నాటికి ఇండియా మూడో స్థానంలో నిలుస్తుందా?
ఒమిక్రాన్ దెబ్బకు ఫ్రాన్స్ అతలాకుతలం అవుతున్నది. మరో వారం రోజుల వ్యవధిలో ఫ్రాన్స్‌లో ఒమిక్రాన్ వేరియంట్ డామినెట్ చేసే అవకాశం ఉందని, ఇతర వేరియంట్ల కంటే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే ఆ దేశంలో ఒమిక్రాన్ వేరియంట్‌కు అడ్డుకట్ట వేయడం ఖచ్చితంగా కష్టం అవుతుందనడంలో సందేహం అవసరం లేదు. తాజా సమాచారం ప్రకారం ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరుగుతున్నట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు డామినెట్ చేస్తే ఫలితాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. కేసులతో పాటు ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య కూడా పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు.