దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఒకవైపు ఒమిక్రాన్ వేరయింట్ కేసులు పెరుగుతుంటే, మరోవైపు కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా విద్యాలయాల్లో విద్యార్థులకు కరోనా సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 72 గంటల్లో తెలంగాణ, కర్ణాటకలోని విద్యాసంస్థల్లో వంద మందికి కరోనా సోకింది. కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 43 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. వారం రోజుల క్రితం కళాశాలలో జరిగిన వేడుకల తరువాత కేసులు బయటపడ్డాయి. దీంతో కాలేజీకి యాజమాన్యం సెలవు ప్రకటించింది. ఇంకా కొంత మందికి సంబంధించిన రిజల్ట్ రావాల్సి ఉందని, మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉన్నట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ తెలియజేసింది.
Read: ఆ దేశానికి కాసులు కురిపిస్తున్న పూల వ్యాపారం…
ఇక ఇదిలా ఉంటే, అటు కర్ణాటక రాష్ట్రంలోనూ కేసులు బయటపడుతున్నాయి. చిక్‌మంగుళూరు జిల్లాలోని జవహార్ నవోదయ విద్యాలయంలో 59 మంది విద్యార్థులకు, 10 మంది స్టాఫ్‌కు కరోనా సోకింది. కరోనా సోకిన విద్యార్థులను ఐసోలేషన్ చేసి చికిత్స అందిస్తున్నట్టు జిల్లా ఆరోగ్యశాఖ అధికారి తెలియజేశారు. వారం రోజుల క్రితం ధర్వాడ్ జిల్లాలో 306 మంది విద్యార్థులకు కరోనా సోకింది. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా సోకడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దేశంలో థర్డ్ వేవ్ తప్పదని వార్తలు వస్తున్న నేపథ్యంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
