కరోనా మహమ్మారి ఇంకా మనల్ని వీడలేదు. కరోనా కంటే వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ విస్తరించినట్టు సమాచారం. రాజస్థాన్‌లో 21, దిల్లీలో 12, కేరళలో 8 ఒమిక్రాన్ కేసులు కొత్తగా బయటపడడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. తమిళనాడులో ఒమిక్రాన్ ఒక్కసారిగా విజృంభించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించడంతో అంతా అలర్ట్ అయ్యారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని ఓ స్కూల్లో 19 మంది విద్యార్థులు కరోనా బారినపడడంతో అక్కడ పరీక్షలు ముమ్మరం చేశారు.
దేశంలో మొత్తం కేసుల సంఖ్య 436కు చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 108 మంది ఒమిక్రాన్కేసులున్నాయి. ఢిల్లీలో 79, గుజరాత్- 43, రాజస్థాన్- 43, తెలంగాణ- 38, కేరళ- 37, తమిళనాడు- 34, కర్ణాటక- 31 , ఏపీలో నాలుగు కేసులు వచ్చాయి. దేశంలో ఇప్పటివరకు 115 మంది ఒమిక్రాన్‌ను జయించి బయటపడ్డారు. కర్ణాటక, కోలార్‌లోని వైద్య కళాశాలలో కొవిడ్-19 కలవరం కలిగిస్తోంది.
33 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో తల్లిదండ్రులు, అధ్యాపకులు ఆందోళనకు గురవుతున్నారు. దక్షిణాదిన ముఖ్యంగా తమిళనాడులో ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పండగల సీజన్లో జాగ్రత్తలు పాటించకపోవటం, అవసరమైన స్థాయిలో వ్యాక్సిన్లు లేకపవటం అందుకు కారణం కావచ్చంటున్నారు. దేశంలో ఒమిక్రాన్ బారినపడిన వారిలో అధిక శాతం మందిలో ఎలాంటి లక్షణాలూ కనబడడం లేదు. ఒకవేళ కొంతమందిలో కనిపించినా ఈ వేరియంట్ ప్రభావం స్వల్పంగానే ఉందని ఢిల్లీకి చెందిన పలువురు వైద్యరంగ నిపుణులు అంటున్నారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ బయటపడినా… అక్కడ ఈ వేరియంట్ సోకిన వారు త్వరగా కోలుకుంటున్నారు.