Site icon NTV Telugu

సీజేఐ ఎన్వీ రమణ తీవ్ర అసంతృప్తి.. అవి పార్లమెంట్‌ సమావేశాలేనా..?

Justice NV Ramana

Justice NV Ramana

తీర్పుల సందర్భంగా.. ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలోనూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ఇప్పుడు ఆయన.. ఈ మధ్యనే ముగిసిన పార్లమెంట్‌ సమావేశాలు జరిగిన తీరుపై స్పందిస్తూ.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చ‌ట్టాలను రూపొందించే స‌మ‌యంలో చ‌ర్చ‌ల‌పై కాకుండా ఆటంకాలు సృష్టించ‌డంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారని వ్యాఖ్యానించారు.. ఒక‌ప్పుడు స‌భ‌లో మొత్తం లాయ‌ర్లే ఉన్న స‌మ‌యంలో పార్లమెంట్ ఎంతో హుందాగా న‌డిచేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ ప‌నితీరు తీవ్ర నిరాశ‌జ‌న‌కంగా ఉందన్న సీజేఐ.. అస‌లు స‌రైన చ‌ర్చే జ‌ర‌గ‌డం లేద‌ని విమ‌ర్శించారు. చ‌ట్టాల‌పై స్పష్టత లేదని.. అస‌లు చ‌ట్టం ప్రయోజ‌నం ఏంటో కూడా తెలియదంటూ ఘాటుగా స్పందించారు.. ఇది ప్రజ‌ల‌కు తీవ్ర న‌ష్టం క‌లుగుతోంది. లాయ‌ర్లు, మేధావులు స‌భ‌లో లేనప్పుడు ఇలాగే జ‌రుగుతుంది అంటూ కామెంట్‌ చేవారు జస్టిస్ ఎన్వీ రమణ.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పుర‌స్కరించుకొని సుప్రీంకోర్టు ఆవ‌ర‌ణ‌లో జ‌రిగిన కార్యక్రమంలో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జస్టిస్ ఎన్వీ రమణ.. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల‌ను చూడండి.. వాళ్లలో చాలా మంది న్యాయ వ్యవ‌స్థకు సంబంధించిన వాళ్లే. మొదటి లోక్‌స‌భ‌, రాజ్యస‌భ‌లో మొత్తం లాయ‌ర్లే ఉన్నారు అని గుర్తుచేసిన ఆయన.. ఇప్పుడు పార్లమెంట్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాలు దుర‌దృష్టక‌రం అన్నారు. ఇక, అప్పట్లో స‌భ‌ల్లో చ‌ర్చలు నిర్మాణాత్మకంగా జరిగేవన్న ఆయన.. ఎంతో నిర్మాణాత్మక అంశాల‌ను లేవ‌నెత్తేవాళ్లు.. చ‌ట్టాల‌ను చ‌ర్చించేవాళ్లు.. ప్రతి ఒక్కరికీ చట్టంలోని శాస‌న వ్యవ‌స్థపై స్పష్టత ఉండేదన్నారు.. కానీ, ఇప్పుడు అవేవీ కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.. అందుకే లాయ‌ర్లు కేవ‌లం న్యాయ సేవ‌ల‌కే ప‌రిమితం కావొద్దని.. ప్రజా సేవ కూడా చేయాలని సూచించిన సీజేఐ.. మీ జ్ఞానాన్ని, తెలివిని దేశం కోసం ఉప‌యోగించండి అని పిలుపునిచ్చారు.

Exit mobile version