NTV Telugu Site icon

యూట్యూబ్‌ ద్వారా భారీగా సంపాదిస్తున్న కేంద్ర మంత్రి..

కరోనా సమయంలో అంతా ఆన్‌లైన్‌ అయిపోయింది.. ఇదే సమయంలో సోషల్‌ మీడియాను ఫాలో అయ్యేవారి సంఖ్య భారీగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.. ఇక, కరోనా విజృంభణ, లాక్‌డౌన్‌, కర్ఫ్యూ లాంటి ఆంక్షలతో సామాన్యుల నుంచి వీవీఐపీలు, సెలబ్రిటీల వరకు అంతా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి.. ఈ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నవారు చాలా మందే ఉన్నారు.. అందుతో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కూడా ఉన్నారు.. ఏదైనా ముక్కుసూటిగా చెప్పే నితిన్‌ గడ్కరీ.. కరోనా సమయంలో తాను చేసిన పనికి యూట్యూబ్‌ తనకు ప్రతి నెల రూ.4 లక్షలు రాయల్టీగా ఇస్తోందని వెల్లడించారు..

గుజరాత్‌లోని భరూచ్‌లో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌ వేపై నిన్న సమీక్ష నిర్వహించారు నితిన్‌ గడ్కరీ.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కాలంలో నేను చెఫ్‌గా మారి ఇంట్లో వంటలు వండాను.. దాంతో పాటు వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా లెక్చర్లు ఇచ్చాను.. విదేశీ యునివర్సిటీలు, విద్యార్థులకూ పాఠాలు చెప్పాను.. ఇలా ఆన్‌లైన్‌లో మొత్తంగా 950పైగా లెక్చర్లు ఇచ్చానని తెలిపారు.. అయతే, ఆ వీడియోలన్నీ యూట్యూబ్‌ చానెల్‌లో అప్‌లోడ్‌ చేయడంతో వాటిని చూసేవారి సంఖ్య కూడా పెరిగిపోయిందని.. దాంతో యూట్యూబ్‌ ప్రతినెలా తనకు రూ.4 లక్షలు రాయల్టీగా చెల్లిస్తోంది వివరించారు నితిన్‌ గడ్కరీ. మొత్తంగా కేంద్రమంత్రిగారి యూట్యూబ్‌ సంపాదన ఔరా అనిపిస్తోంది..