టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ జనసేన కార్యాలయానికి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గురువారం నాడు గుంటూరు జిల్లా కుంచనపల్లిలో పర్యటించిన నారా లోకేష్… అనూహ్యంగా జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడ జనసేన కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించారు. కుంచన పల్లిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, పార్టీ విషయాలను జనసేన నేతలు, కార్యకర్తలతో నారా లోకేష్ చర్చించినట్లు తెలుస్తోంది.
Read Also: వెంకయ్య మనవరాలి రిసెప్షన్‌కు హాజరుకానున్న సీఎం జగన్
అయితే ఇప్పటికే టీడీపీ-జనసేన ఒక్కటే అని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్న సమయంలో తాజాగా నారా లోకేష్ జనసేన కార్యాలయంలోకి వెళ్లడం మరింత తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు చేస్తున్నా.. ఆయన వెనుక చంద్రబాబు ఉన్నాడని పదేపదే మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే నారా లోకేష్ మర్యాదపూర్వకంగానే జనసేన కార్యాలయానికి వెళ్లారని.. ఇందులో ఎలాంటి ఉద్దేశాలు లేవని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
