Site icon NTV Telugu

పవన్ చెప్పిందే వాస్తవం : నాని

nani

సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవాకట్టా దర్శకత్వంలో రూపొందిన ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై, సినిమా ఇండస్ట్రీ సమస్యలపై, టికెట్ రేట్లు, ఆన్లైన్ టికెట్ విధానం, ఏపీలో థియేటర్ల సమస్యలు, ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం తీరుపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఇక పనిలో పనిగా సినిమా ప్రముఖులకు కూడా పవన్ చురకలు అంటించారు. అందులో భాగంగానే నాని సినిమా ‘టక్ జగదీష్’ ఓటిటి రిలీజ్ వివాదంపై స్పందిస్తూ ‘ఆ అబ్బాయి నాని ఏం చేస్తాడు? గత్యంతరం లేని పరిస్థితిలో ఓటిటిలో విడుదల చేశాడు. అతని తప్పేం ఉంది? థియేటర్ యజమానులంతా ఆయనపై పడితే ఏంటి అర్థం. వెళ్ళి వైసీపీ నాయకులతో మాట్లాడుకోండి’ అంటూ ఫైర్ అయ్యాడు.

Rea Also : నాని సినిమా కాంట్రవర్సీపై పవన్ రియాక్షన్

తాజాగా నాని సైతం నిన్న పవన్ ఇచ్చినా స్పీచ్ పై స్పందిస్తూ ట్వీట్ చేశారు. “పవన్ కళ్యాణ్ సర్, ఏపీ ప్రభుత్వం మధ్య ఉన్న రాజకీయ విభేదాలను పక్కన పెట్టండి. ఆయన చెప్పిందే వాస్తవం… చిత్ర పరిశ్రమ సమస్యలను జెన్యూన్ గా వెల్లడించారు. ఆ సమస్యలపై వెంటనే శ్రద్ధ పెట్టడం అవసరం. ఇంకా ఆలస్యం కాకముందే ముఖ్యమంత్రి జగన్ గారు, సంబంధిత మంత్రులు ఈ విషయంపై దృష్టి సారించాలని ఒక ఇండస్ట్రీ మెంబెర్ గా నేను వినయంగా అభ్యర్థిస్తున్నాను” అంటూ వరుస ట్వీట్లు చేశారు. ఇక నెమ్మదిగా స్టార్ హీరోలంతా ఒక్కొక్కరూ ఈ వివాదంపై స్పందించే అవకాశం ఉంది.

Exit mobile version