త్వరలోనే కర్ణాటక రాష్ట్రంలో హనేగల్, సిందగీ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో బీజేపి తప్పకుండా గెలిచి పట్టు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప తప్పుకున్నాక జరగబోతున్న ఉప ఎన్నికలు కావడంతో ఎలాగైనా సరే గెలిచి పట్టు నిరూపించుకోవాలి. ఇది ఆ పార్టీకి అగ్ని పరీక్ష లాంటివి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని యడ్యూరప్ప, జగదీశ్ షెట్టర్, డీవీ సదానంద గౌడ, నళిన్ కుమార్ కటిల్ లతో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను అంచనా వేయబోతున్నారు. ఈ సందర్భంగా మాజీముఖ్యమంత్రి యడ్యూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించాలంటే మోడీ వేవ్ ఒక్కటే సరిపోదని, రాష్ట్రంలో అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని బట్టే ఎన్నికల్లో గెలుపోటములు ఉంటాయని అన్నారు. కేంద్రంలో ప్రధాని మోడి చాలా పనులు చేస్తున్నారని, కేంద్రంలో మళ్లీ మోడి పాలనే వస్తుందని, కానీ, రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించాలంటే అభివృద్ది పనులు తప్పనిసరి అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మేల్కొన్నదని, ఆ పార్టీ ఎత్తులను చిత్తుచేయాలి అంటే అభివృద్ది ఒక్కటే మంత్రమని యడ్యూరప్ప పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలగాలని ఆయన పేర్కొన్నారు.
యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు: గెలవడానికి మోడీ వేవ్ ఒక్కటే సరిపోదు…
