అధికారపార్టీలో చేరాక.. నిన్న మొన్నటి వరకు కామ్‌గా ఉన్న ఆ ఎమ్మెల్యే ఒక్కసారిగా గేర్ మార్చారా? మంత్రిపైనే పైచెయ్యి సాధించారా? కీలక పదవిని తన నియోజకవర్గానికి దక్కించుకుని చర్చల్లోకి వచ్చారా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా పదవి?
ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్‌లో.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల క్రాస్ ఓటింగ్ వేడి సెగలు రేపుతున్న సమయంలో.. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవి నియామకం మరో కొత్త చర్చకు దారితీసింది. పార్టీ నేత కొత్తూరు ఉమా మహేశ్వరరావుకు ఈ పదవి కట్టబెట్టారు. కొత్తూరుకు పదవి రావడం వెనక సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఉన్నారని తెలియడంతో హీట్ ఇంకా పెరిగింది. పైగా మంత్రి పువ్వాడ అజయ్‌కు చెక్ పెట్టి తన జిల్లాకు పదవి పట్టుకుపోయారని అధికారపార్టీలోనే కథలు కథలుగా చెప్పుకొంటున్నారట.
సండ్ర అనుచరుడికి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవి..!
ప్రస్తుతం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అయిన కొత్తూరు ఉమాకు గతంలో సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మన్‌ను చేస్తామని ఎమ్మెల్యే సండ్ర హామీ ఇచ్చారట. కానీ.. మున్సిపల్ ఛైర్మన్ పదవి కమ్మ సామాజికవర్గానికి కేటాయించడంతో కొత్తూరు సామాజికవర్గానికి చెందిన ఆర్యవైశ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆ వర్గాన్ని శాంతింపచేసేందుకు సండ్ర గట్టిగానే పోరాడి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారని చెబుతున్నారు.
టీఆర్ఎస్‌లో సండ్రకు ప్రాధాన్యం పెరిగిందని ప్రచారం..!
ఖమ్మం జిల్లాలో గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ పదవి అత్యధిక ముస్లింలకే కేటాయిస్తూ వస్తుంటాయి. నిన్న మొన్నటి వరకు ఎండీ ఖమర్ ఆ పదవిలో ఉన్నారు. అయితే ఖమర్ తీరుపై అసంతృప్తిగా ఉన్న మంత్రి అజేయ్.. ఆయన్ని తప్పించాలని అనుకున్నారట. ఆ పోస్ట్‌లో అనుచరుడిని కూర్చోబెట్టాలని భావించారట అజేయ్. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సండ్ర.. పరిస్థితిని అనుకూలంగా మలుచుకున్నట్టు సమాచారం. ఖమర్‌ను మారిస్తే ఆ పదవి సత్తుపల్లికి కేటాయించాలని టీఆర్‌ఎస్ అధిష్ఠానంపై ఒత్తాడి చేశారట. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత సండ్రకు అధిష్ఠానం దగ్గర ప్రాధాన్యం పెరిగిందట. అది ఈ సందర్భంగా వర్కవుట్ అయిందని అనుకుంటున్నారట. దాంతో మంత్రి ఇలాకా నుంచి జిల్లా స్థాయి పదవిని సండ్ర పట్టుకెళ్లిపోయారని చర్చ మొదలైంది.
గతంలో ముస్లిం సామాజికవర్గానికి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవి..!
అయితే.. జిల్లాలో ముస్లింలకే కచ్చితంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవిని కేటాయిస్తారని అనుకుంటున్న సమయంలో.. కొత్త మార్పు ఆ వర్గంలోనూ చర్చగా మారిందట. అందుకే ముస్లిం సామాజికవర్గాన్ని సంతృప్తి పర్చేందుకు అధికారపార్టీ నేతలు ఏం చేస్తారనే ప్రశ్న వినిపిస్తోంది. ఎమ్మెల్యే సండ్ర తీరుతోపాటు ఈ అంశంపైనా టీఆర్‌ఎస్‌లో చర్చ జరుగుతోందట. మరి.. ఈ సమస్యను పరిష్కరించేందుకు సండ్రే చొరవ తీసుకుంటారో.. అది తనపని కాదని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారో చూడాలి.