కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషనే కీలకంగా మారిపోయింది.. ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి… స్వదేశీ, విదేశీ వ్యాక్సిన్ల సరిఫరా కొనసాగుతోంది.. తాజాగా, అమెరికా సంస్థకు చెందిన సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు కూడా భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. మరోవైపు.. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండడంతో… వాటిపై కూడా అధ్యయనాలు కొనసాగుతున్నాయి.. ఇక, స్వదేశీ టీకాలైన కోవిషీల్డ్, కోవాగ్జిన్ కలిపి.. ఒకటే టీకాగా వేస్తే ఫలితాలు ఎలా ఉంటాయని అనేదానిపై భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్ఆర్) తాజాగా చేపట్టిన అధ్యయనంలోనూ టీకా మిక్సింగ్ మంచి ఫలితాలను ఇస్తున్నట్టు వెల్లడైంది.
ఉత్తరప్రదేశ్‌లో మే, జూన్ నెలల్లో ఈ అధ్యయనం జరగగా.. రకరకాల వేరియంట్ల ద్వారా విడతల వారీగా జరుగుతున్న కరోనా దాడిని నిరోధించేందుకు ఇది ప్రభావశీలమైన ఆయుధమని కూడా శాస్త్రవేత్తలు భావనగా ఉంది. అంటే.. మొదటి డోసుగా కోవిషీల్డ్, రెండో డోసుగా కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఇస్తే.. ఈ విధానం సురక్షితమైనదే కాకుండా కొత్త కరోనా వేరియంట్ల నుంచి మెరుగైన రక్షణ కూడా ఇస్తున్నట్టు ఈ అధ్యయనం తేల్చింది. ఈ పద్ధతితో టీకా కొరతను కూడా అధికమించవచ్చని అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు పేర్కొన్నారు.