NTV Telugu Site icon

‘గెల్లు’ను బానిస కాదు.. జానారెడ్డికి పట్టిన గతే ఈటలకు..!

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav

హుజురాబాద్‌ ఉప ఎన్నికల కోసం అందికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది అధికార టీఆర్ఎస్‌ పార్టీ… విద్యార్థి ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను బరిలోకి దింపింది.. మరోవైపు.. తన నియోజకవర్గమైన హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ పాదయాత్రలు, సభలు, సమావేశాలు జరుగుతున్నా.. ఆయనే అభ్యర్థి అని ఇప్పటి వరకు అధిష్టానం తేల్చింది లేదు.. ఇక, కాంగ్రెస్‌ పార్టీ కూడా అభ్యర్థి వేటలో ఉంది.. అయితే, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్.. కేసీఆర్‌ బానిస అంటూ ఈటల రాజేందర్‌ కామెంట్‌ చేయడంపై టీఆర్ఎస్‌ మండిపడుతోంది… ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్.. గెల్లును ఈటల బానిస అనడం భావ్యం కాదన్నారు.. ఇది ఈటల రాజేందర్‌ అహంకారానికి నిదర్శనం అని మండిపడ్డ ఆయన.. ఈటల ముందు గెల్లు చిన్న పిల్లవాడు కావచ్చు.. ఆ నాడు ఈటల కూడా దామోదర్ రెడ్డి ముందు చిన్నవాడేనని గుర్తుచేశారు.

ఇక, ఈటల రాజేందర్‌.. హుజురాబాధ్‌లో బీసీ… శామీర్‌పేట్‌లో ఓసీ అంటూ సెటైర్లు వేశారు తలసాని శ్రీనివాస్‌ యాదవ్.. హుజురాబాద్ ప్రజలు ఈటలకు గుణపాఠం చెబుతారని హెచ్చరించిన ఆయన.. ఉద్యమకారులకు టీఆర్ఎస్ ప్రాధాన్యతనిస్తుందని.. గతంలో సుమన్, కిశోర్ లాంటి వాళ్లకు పార్టీ అవకాశం కల్పించింది.. గెల్లు శ్రీనివాస్ కు కూడా అదేవిధంగా కేసీఆర్ ప్రాధాన్యతనిచ్చారని వెల్లడించారు.. నాగార్జున సాగర్‌ బైపోల్‌లో జానారెడ్డికి పట్టిన గతే.. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు పడుతుందని జోస్యం చెప్పారు మంత్రి తలసాని.. గతంలో ఆరు సార్లు కేసీఆర్‌ దయతోనే ఈటల విజయం సాధించారన్న ఆయన.. బీజేపీ నేతలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ హితవుపలికారు.