Site icon NTV Telugu

తెలంగాణ నేతలను బీజేపీ బిచ్చగాళ్లుగా చూస్తోంది : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో మాటల యుద్ధ నడుస్తూనే ఉంది. ఇటీవల తెలంగాణ మంత్రులు ఢిల్లీ పెద్దలను ధాన్యం కొనుగోళ్లపై కలిసేందుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. మంత్రులను అవమాన పరిచి ఢిల్లీ నుంచి పంపితే భవిష్యత్ లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.

జాతీయ పార్టీల నేతలు ఢిల్లీకి పైరవీ ల కోసం వెళతారు కానీ.. మేము తెలంగాణ ప్రయోజనాల కోసం వెళతామంటూ ఆయన వ్యాఖ్యానించారు. అడుక్కోవడానికి మేము బిచ్చగాళ్ళం కాదని, తెలంగాణ నేతలను బీజేపీ బిచ్చగాళ్లుగా చూస్తోందని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు ఢిల్లీలో రైతుల కోసం కాకుండా తమ రాజకీయాల కోసం తమ పెద్దలతో మాట్లాడుతున్నారని, ధాన్యం సేకరణ పూర్తిగా కేంద్రం భాద్యతే దాన్నుంచి తప్పుకునే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

మంచి చేస్తే దేశమంతా తిరిగి కేంద్రం మంచి చేసిందని చెబుతామని, చెడు చేస్తే దానికి తగ్గట్టే వ్యవహరిస్తామని ఆయన అన్నారు. కేసీఆర్ మీద కోపంతో అధికార దాహంతో బీజేపీ తెలంగాణను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని శ్రీనివాస్‌ గౌడ్‌ వెల్లడించారు. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రాకూడదు, ఆయన్ను బద్నాం చేయాలని బీజేపీ నేతలు కుట్ర పన్నారని, వారి కుట్రలను ఛేదిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని ఎదుర్కోవడానికి మా వ్యూహం మాకుంది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

https://ntvtelugu.com/harish-rao-said-that-even-though-the-penetration-of-omicron-is-high-the-intensity-is-low/
Exit mobile version