టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలను చీల్చి చెండాడాడు. టీఆర్ఎస్ పై ప్రతిపక్షాలు చేస్తున్న తీవ్ర విమర్శలపై కొద్దికాలంగా మౌనంగా ఉంటున్న మంత్రి కేటీఆర్ ఈరోజు బరస్ట్ అయ్యాడు. టీఆర్ఎస్ ప్లీనరీ సాక్షిగా తన మౌనాన్ని బద్దలు కొట్టారు. తాజాగా జలవిహార్లో జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి ప్లీనరీ సమావేశంలో ప్రత్యర్థులపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘నాన్న.. పందులే గుంపులుగా వస్తాయని.. సింహం సింగిల్ గా వస్తుంద’నే రీతిలో ప్రతిపక్ష పార్టీలను ఏకిపారేశాడు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూకుడు చూస్తుంటే ఇక తగ్గేదేలే అన్నట్లుగా రాష్ట్రంలో రాజకీయాలు సాగబోతున్నాయా? అన్నట్లు సీన్ కన్పిస్తోంది. మొత్తానికి ఈ సమావేశంలో కేటీఆర్ ప్రతిపక్ష పార్టీలపై చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీ కాంగ్రెస్, టీ బీజేపీ నేతలను ఎవరూ పట్టించుకోలేదని.. తెలంగాణ వచ్చిన తర్వాతే కేసీఆర్ పుణ్యమా అని కొంతమందికి పదవులు దక్కాయని కేటీఆర్ చెప్పుకొచ్చాడు. వీటిని చూసుకొని కొంతమంది ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ మీకంటే వయసులో 20ఏళ్లు పెద్దవారని, సీఎం హోదాలో ఉన్న వ్యక్తిపై చిల్లర మాట్లాడటం తగునా? అంటూ కేటీఆర్ మండిపడ్డారు. పేరుకేమో కొన్ని ఢిల్లీ పార్టీలనీ చేసేవి మాత్రం చిల్లర పనులంటూ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ నేతలు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలంటూ సూచనలు చేశారు.
డెబ్బై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు కరెంట్, తాగునీరు ఇచ్చిన పాపానా పోలేదన్నారు. రైతులకు 24గంటల కరెంట్ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ దేనని కేటీఆర్ స్పష్టం చేశారు. నల్లగొండలో ఫ్లోరోసిస్ లేదని కేంద్రమే పార్లమెంట్‌లో చెప్పిందని.. ఇది తెలంగాణకు గర్వకారణం కాదా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రైతులు సుభిక్షంగా ఉంటే ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని విమర్శించారు. ‘కేసీఆర్‌పై అవాకులు చవాకులు పేలితే బరాబర్ సమాధానం చెప్తాం.. కుక్క కాటు చెప్పు దెబ్బ తప్పదని.. ఓపిక పట్టినం.. సైలెంట్‌గా ఉండే కొద్ది మాటలు ఎక్కువైతున్నాయి’ అంటూ ఓ రేంజులో కేటీఆర్ ఫైరయ్యారు.
ఏడేళ్లలో గులాబీ జెండా గల్లీ టు ఢిల్లీకి చేరిందన్నారు. 2014లో 63 సీట్లతో ప్రారంభమైన ప్రస్థానం వరుస ఎన్నికల్లో అప్రహతీతంగా కొనసాగిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ కు 88 స్థానాలు కట్టబెట్టి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో 9 సీట్లు రాగా ఆ తర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీనే ఎక్కువ సీట్లను గెలుచుకుందన్నారు. కేసీఆర్ పాలనకు ప్రజలు నీరాజనం పడుతుంటే ప్రతిపక్షాలు పత్రికల్లో హెడ్‌లైన్స్ కోసం కేసీఆర్ పై అవాకులు చేవాకులు పేలుతున్నాయన్నారు. ప్రజలు వీరిని పట్టించుకోవడం లేదన్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్ చాలా బలంగా ఉందని కేటీఆర్ గుర్తుచేశారు. 60లక్షల పైచిలుకు సభ్యులు టీఆర్ఎస్ లో ఉన్నారని తెలిపారు. 33 జిల్లాల్లో జిల్లా పార్టీ కార్యాలయాలు కట్టుకున్నామన్నారు. తాజాగా ఢిల్లీలోనూ తెలంగాణ భవన్‌కు భూమిపూజ చేసుకున్నామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు ఏ ఎన్నికలు లేవన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ కు సమస్యనే కాదని తేల్చిపారేశారు. కేవలం నాయకుడు ఒక్కడుంటేనే సరిపోదని సైన్యం కూడా అవసరమన్నారు. ఇందుకోసం కమిటీలను పటిష్టం చేసుకోవాలని సూచించారు.
జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు త్వరితగతిన ఏర్పాటు చేసుకోవాలన్నారు. వీటి ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నాయకులకు సూచించారు. గ్రేటర్ పరిధిలో 4,800దాకా కాలనీ అసోసియేషన్లు.. 1486 నోటిఫైడ్ బస్తీలు ఉన్నాయని తెలిపారు. మొత్తం కలిపి 6,300 దాకా కాలనీలు, బస్తీలు ఉన్నాయన్నారు. సెప్టెంబర్ 29లోపు వీటన్నింటికి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒక్కో కమిటీలో 15మందికి తగ్గకుండా చూసుకోవాలన్నారు. డివిజన్ స్థాయిలో 150డివిజన్ కమిటీలు ఏర్పాటు చేసుకోవడంతోపాటు ఈసారి జిల్లా కమిటీలు వేసుకోవాలని కేసీఆర్ చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు.
పార్టీ కోసం కష్టపడుతున్న వారిని తప్పకుండా గౌరవించుకుంటామని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. పదవుల రాలేదని ఎవరూ బాధపడొద్దని త్వరలోనే 500 నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తుందని తెలిపారు. దసరా, దీపావళి తర్వాత కొత్త కమిటీలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనన్నట్లు కేటీఆర్ తెలిపారు. మొత్తానికి కేటీఆర్ చాలారోజులు తర్వాత జూలు విధించడంతో ప్రతిపక్ష పార్టీలు ఎలా రియాక్టవుతాయనేది ఆసక్తికరంగా మారింది.
