ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా లేఖ రాశారు. పేదలకు ఢిల్లీ ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ సబ్సిడీని ఆపేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రులు ఆరోపించారు. దీనిని తీవ్రంగా ఖండించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గత కొన్ని వారాలుగా, ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి అతిషి, ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ గవర్నర్ తీరుపై మండిపడుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వ విద్యుత్ సబ్సిడీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు సక్సేనా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆప్ నేతలు చేసిన ఆరోపణలను లెఫ్టినెంట్ గవర్నర్ కొట్టిపారేశారు. వారు చేసే ఆరోపణలు నిస్సందేహంగా తప్పుదోవ పట్టించేవే అని, పరువు నష్టం కలిగించేవి అని చెప్పారు. “నాకు వ్యతిరేకంగా ప్రభుత్వం, పార్టీలో మీరు, మీ సహచరులు చేసిన నిరాధారమైన, తప్పుడు ప్రకటనలకు సంబంధించి జవాబుదారీతనం బాధ్యతను కోరుతూ నేను మీకు లేఖ రాస్తున్నాను” అని అంటూ గవర్నర్ సక్సేనా సీఎం కేజ్రీవాల్‌కు లేఖలో రాశారు. పేదలకు విద్యుత్ సబ్సిడీకి నేను ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నానని, వివిధ సందర్భాల్లో వేర్వేరు ఫైళ్లపై వ్రాతపూర్వకంగా పబ్లిక్ డొమైన్‌లో అదే స్పష్టంగా చెప్పానని మీకు బాగా తెలుసు అని లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు.
Also Read:Harish Rao : సభా వేదికగా క్షమాపణలు చెప్పిన మంత్రి హరీష్ రావు
లెఫ్టినెంట్ గవర్నర్ విద్యుత్ సబ్సిడీని నిలిపివేయాలని కోరుకుంటున్నారని లేదా విద్యుత్ సబ్సిడీని ఆపడానికి అధికారులు లేదా రాజకీయ పార్టీతో కుట్ర పన్నుతున్నారని నిర్ధారించే ఏదైనా ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. సాక్ష్యాలను చూపించడంలో విఫలమైతే ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు చట్టపరమైన చర్యలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ఏప్రిల్ 15 వరకు గడువు ముగిసే వరకు నిర్ణయాన్ని ఎందుకు పెండింగ్‌లో ఉంచారని లెఫ్టినెంట్ గవర్నర్ ప్రశ్నించారు.
కాగా, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు తమను వేధించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ఆప్ నేతలు తరచూ విరుచుకుపడుతున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడుతో సహా ఇతర బిజెపియేతర రాష్ట్రాలు కూడా అదే ఆరోపించాయి.
