NTV Telugu Site icon

అచ్చెదిన్‌: ఏడాదిలో 306 పెరిగిన సిలిండర్

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నా.. పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం పెరుగుతూనే వున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి పెట్రోల్ ధరలు 19 సార్లు పెరిగిందంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన మూడు వారాల్లో లీటర్ పెట్రోల్ పై 5 రూపాయల 7 పైసలు పెరిగింది. ఇక సెప్టెంబర్ 24 నుంచి డీజిల్ ధరలు 22 సార్లు పెరిగాయి. లీటర్ డీజిల్ పై గడిచిన మూడు వారాల్లోనే 7 రూపాయలు పెరిగింది.

హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.55 పైసలుండగా.. డీజిల్ ధర రూ.104.70గా ఉంది. పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలతో సామాన్యుడిపై తీవ్ర ప్రభావం పడుతోంది. వీటికి తోడు కూరగాయల ధరలు కూడా మండిపోతున్నాయి. టమోటా ధర కాస్త తగ్గినా.. మిగిలిన కూరగాయలు, ముఖ్యంగా ఉల్లి ధర పెరగడం సామాన్యులకు కష్టాలు తెచ్చిపెడుతోంది. గృహిణులకు వంటింట్లో కన్నీళ్ళు వస్తున్నాయి. ఎలా కొనాలి, ఎలా తినాలి అంటున్నారు.

హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధరలు మంట పుట్టిస్తున్నాయి. 14.2 కేజీల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర 952 రూపాయలుగా వుంది. గత ఏడాది కాలంగా గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా పెరిగాయో ఒక సారి పరిశీలిస్తే దిమ్మ తిరగకమానదు. ఏడాది క్రితం 646 రూపాయలు వున్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు 306 రూపాయలకు పైగా పెరిగింది. నవంబర్ నాటికి వెయ్యి రూపాయల మార్కుకి చేరడం అంత కష్టమేం కాదు. కానీ ఈ సిలిండర్ బండ మోయలేక మళ్ళీ కట్టెల పొయ్యి వెళతారేమో సామాన్యులు. మోడీజీ జర ఆలోచించండి.

ధరల పెరుగుదల ఇలా..
అక్టోబర్ 2021 Rs.952.00
సెప్టెంబర్ 2021 Rs.937.00
ఆగస్ట్ 2021 Rs.912.00
జూలై 2021 Rs.887.00
జూన్ 2021 Rs.861.50
మే 2021 Rs.861.50
ఏప్రిల్ 2021 Rs.861.50
మార్చి 2021 Rs.871.50
ఫిబ్రవరి 2021 Rs.821.50
జనవరి 2021 Rs.746.50
డిసెంబర్ 2020 Rs.746.50
నవంబర్ 2020 Rs.646.50
అక్టోబర్ 2020 Rs.646.50
సెప్టెంబర్ 2020 Rs.646.50