(జూన్ 24న మురళీ మోహన్ పుట్టినరోజు)
‘జగమే మాయ’ అంటూ చిత్రసీమలో ప్రవేశించిన మురళీ మోహన్ ఈ మాయా జగతిలోనూ అందరివాడు అనిపించుకున్నారు. కొందరు ఆయనను ‘అసలైన అందరివాడు’ అనీ అంటారు. నొప్పించక తానొవ్వక అన్నట్టుగా మురళీమోహన్ తీరు ఉంటుంది. అందరినీ నవ్వుతూ పలకరించడం, చిత్రసీమలో తనను ఆశ్రయించిన వారికి తగిన సాయం చేయడం, సినిమా రంగంలో ఏదైనా కార్యక్రమ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించడం, ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’కు అధ్యక్షునిగా తనదైన బాణీ పలికించడం, ‘జయభేరీ’ అధినేతగా మరపురాని చిత్రాలను అందించడం, రియల్ ఎస్టేట్ లోనూ జయభేరీ మోగించడం, తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా విజయం సాధించడం- ఇలా పలు విధాలా సాగిన మురళీ మోహన్ ఈ జూన్ 24తో 81 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఎంతో చురుగ్గా ఉంటూ, తన దరికి చేరిన పాత్రల్లో నటించడానికీ సిద్ధంగా ఉన్నారు. ఇక చదువుకోవాలనుకొనే నిరుపేదలకు చేయూతను అందిస్తూ ఉన్నారాయన.
మరపురాని యేడాది…
మురళీ మోహన్ అసలు పేరు రాజాబాబు. తన కుటుంబ వ్యాపారం చూసుకుంటూ మదరాసుకు తరచూ వెళ్ళేవారు. ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ ‘మన’సత్యం దగ్గరకు ఓ మిత్రుణ్ణి ఫోటో తీయించడానికి తీసుకు వెళ్ళారు. ఆ సమయంలో ‘నువ్వే హీరోలా ఉన్నావ్, సినిమాల్లో ట్రై చేయరాదూ’ అంటూ సత్యం సలహా ఇచ్చారు. దాంతో మురళీమోహన్ కూడా సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు. అప్పటికే ఆయన మిత్రులు కొందరు చిత్రసీమలో ఉండడంతో మురళీమోహన్ కూడా ఉత్సాహంగా సినిమా రంగంవైపు పరుగులు తీశారు. 1973లో ‘జగమే మాయ’ చిత్రంలో తొలిసారి నటించిన మురళీమోహన్ ఆ తరువాత హీరో వేషాలే వేస్తానని మడి కట్టుకు కూర్చోలేదు. తన దగ్గరకు వచ్చిన ప్రతీపాత్రకు న్యాయం చేస్తూ పోయారు. దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, క్రాంతికుమార్, ఛటర్జీ, విజయబాపినీడు వంటివారు మురళీమోహన్ ను భలేగా ప్రోత్సహించారు. కొన్నిసార్లు హీరోని చేశారు, మరికొన్ని సార్లు కేరెక్టర్ యాక్టర్ గానూ చూపారు.
మురళీమోహన్ నటజీవితంలో 1978వ సంవత్సరం మరపురానిది. ఆ సమయంలో యన్టీఆర్ ఓ వైపు పదికి పైగా చిత్రాల్లో నటించారు. మరోవైపు ఏయన్నార్ కూడా ఐదు సినిమాలు చూపారు. ఇక కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్ – ఇలా అందరూ వరుస సినిమాలు విడుదల చేశారు. అయినా ఆ సంవత్సరం మురళీమోహన్ హీరోగా రూపొందిన ‘పొట్టేలు పున్నమ్మ’ అనూహ్య విజయం సాధించి, ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలచింది. అందువల్ల ఆ సంవత్సరం మురళీమోహన్ కు మరపురానిది అని చెప్పవచ్చు.
‘జయభేరీ’ మోగించి….
మురళీమోహన్ హీరోగా నటించిన అనేక చిత్రాలు విజయం సాధించాయి. అయినా సైడ్ హీరో రోల్స్ ను మాత్రం వీడలేదు. ‘స్వీయలోపంబెరుగుట పెద్ద విద్య’ అన్న మీర్జా గాలిబ్ సూక్తిని ఏయన్నార్ తు.చ. తప్పక పాటించేవారు. ఆయన సలహాతోనే మురళీమోహన్ తన దరికి చేరిన పాత్రల్లో నటించారు. గిరిబాబు ‘జయభేరి’ సంస్థ నెలకొల్పి తెరకెక్కించిన చిత్రాల్లో మురళీమోహన్ కీలక పాత్రలు పోషించారు. తరువాత అదే బ్యానర్ ను మురళీమోహన్ సొంతం చేసుకొని అనేక మరపురాని చిత్రాలను నిర్మించారు. కొన్నిట తానే హీరోగా నటించారు. మరికొన్నిటిలో ఇతరులను హీరోలుగా పెట్టి సినిమాలు తెరకెక్కించారు. ఆయన నూరవ చిత్రంగా రూపొందిన ‘పిచ్చి పంతులు’ కూడా జయభేరీ చిత్రమే. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అదే సమయంలో యన్టీఆర్ రాజకీయప్రవేశం చేశారు. అందులో “రామయ్యా రావయ్యా…” అంటూ రూపొందించిన పాట ఆ రోజుల్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. యన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మురళీమోహన్ హైదరాబాద్ మకాం మార్చారు. ఓ వైపు సినిమాలు నిర్మిస్తూనే, మరోవైపు రియల్ ఎస్టేట్ లో కాలు మోపారు. ‘భూమిని నమ్ముకుంటే అది మనల్ని కాపాడుతుంది’ అన్న శోభన్ బాబు సూత్రాన్ని అనుసరిస్తూ మురళీమోహన్ తాను రియల్ ఎస్టేట్ లో అడుగు పెట్టానని చెబుతారు. నిజంగానే రియల్ ఎస్టేట్ లో ఆయన ‘జయభేరీ’ మోగించారు. ఇక తమ జయభేరీ పతాకంపై ఆయన నిర్మించిన చివరి చిత్రం ‘అతడు’. ఆ సినిమా అప్పట్లో ఆయనకు ఆట్టే లాభాలు సంపాదించి పెట్టలేకపోయింది. అయితే, విచిత్రంగా బుల్లితెరపై ‘అతడు’ విశేషంగా అలరించింది. ఆ సినిమా తెచ్చిన నష్టాన్ని శాటిలైట్ ద్వారానే పూడ్చేసింది.
అదే సూత్రం…
చిత్రనిర్మాణానికి దూరంగా ఉన్న మురళీమోహన్ తెలుగుదేశం పార్టీలో చేరి, 2009లో రాజమండ్రి లోక్ సభకు పోటీ చేసి, పరాజయాన్ని చవిచూశారు. 2014లో అదే నియోజక వర్గం నుండి టీడీపీ టిక్కెట్టు పైనే గెలుపు సాధించారు. తరువాత రాజకీయాలకు దూరంగా జరిగారు. ఎనభై ఏళ్ళ వయసులోనూ ఇప్పటికీ ఉరకలు వేసే ఉత్సాహంతో ఉన్న మురళీమోహన్ ను చూస్తే, ఆయన వయసులో సగం ఉన్నవారికి కూడా స్ఫూర్తి కలుగుతుంది. ఎలాంటి సమస్యలు దరి చేరినా, నవ్వుతూనే ముందుకు సాగాలన్నది ఆయన ఫిలాసఫీ. ఇప్పటికీ అదే సూత్రాన్ని అనుసరిస్తున్న మురళీమోహన్ మరిన్ని వసంతాలు ఆనందంగా చూడాలని ఆశిద్దాం.