చదివిన చదువుకు తగిన ఉద్యోగం కావాలని నిరుద్యోగులు కోరుకుంటారు. కానీ వారి ఆశలు ఆవిరవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ సరైన ఉద్యోగాల భర్తీ జరగలేదు. నిధులు, నీళ్ళు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఏర్పడి ఏడేళ్ళు అవుతోంది. వయసు మీదపడుతోంది. కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు నిరుద్యోగులకు ఇబ్బందిగా మారాయి. దీనికి తోడు చిన్నాచితకా ఉద్యోగాలు చేద్దామన్నా కరోనా మహమ్మారి వల్ల అవి కూడా కుదరడం లేదు.
రాష్ట్రంలోని రెండేళ్లుగా ఎదురుచూస్తున్న జంబో ఉద్యోగ ప్రకటన ఇంకెప్పుడు అంటూ నిరుద్యోగులు అసహనంతో వున్నారు. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు ఖాళీల భర్తీకి గత రెండేళ్లుగా కొనసాగుతున్న కసరత్తు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కొత్త మల్టీజోన్లు, జోన్లు, జిల్లాల వారీగా పోస్టుల వర్గీకరణ ఇటీవల పూర్తయినా, ఆ మేరకు ఉద్యోగుల సర్దుబాటుపై ఇంకా నిర్ణయం జరగకపోవడంతో అడుగులు ముందుకు పడటం లేదు. టీఎస్‌పీఎస్సీ వద్ద ఉద్యోగాల కోసం రిజస్టరైన దాదాపు 25 లక్షల మంది ఉద్యోగార్థులు ప్రకటనల కోసం ఎదురుచూస్తున్నారని అంచనా.
ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశతో సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు గరిష్ఠ వయోపరిమితి దాటిపోతోంది. రాష్ట్రంలో రెండేళ్లలో వ్యవసాయ, పశువైద్య వర్సిటీల్లో సహాయకుల పోస్టులు మినహా కొత్త కొలువుల ప్రకటనలు రాలేదు. పోలీసు విభాగంలో 19 వేల ఉద్యోగాలు ఖాళీ. కానీ వాటి భర్తీకి ఎలాంటి ప్రకటనలు వెలువడకపోవడం నిరుద్యోగుల్ని కలచివేస్తోంది. 2018లోనే దాదాపు 150 పోస్టులతో తొలి తెలంగాణ గ్రూప్-1 ప్రకటనకు ఏర్పాట్లు పూర్తయినా కొత్తజోన్లు, మల్టీజోన్ల పేరిట నిలిచిపోయింది. గతంలోనే గుర్తించిన గ్రూప్-2, గ్రూప్-3 ఇతరత్రా 1949 పోస్టుల ప్రతిపాదనలు సవరించాలని 2018లో టీఎస్‌పీఎస్సీ వెనక్కి పంపించింది.
టీఎస్‌పీఎస్సీ పరిధిలో నిలిచిన గ్రూప్-1, గ్రూప్-3 ప్రకటనలకు అత్యంత ప్రాధాన్యం కింద వెంటనే వెలువరించాలని కమిషన్ లక్ష్యంగా పెట్టుకున్నా.. ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రాలేదు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు 2022లోనైనా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయని, పోటీపరీక్షల్లో పాల్గొని మంచి ఉద్యోగం సంపాదించాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆశలు నెరవేరడం లేదు. ప్రతిసారీ అధికార టీఆర్ఎస్ పార్టీ సభల్లో ఉద్యోగాల ప్రకటన వుంటుందని ఆశలు చూపిస్తారు. కానీ అవి కార్యరూపం దాల్చకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశతో వుంటున్నారు. వారి ఆశలు అడియాసలేనా? కేసీఆర్ సార్ కాస్త కనికరించండి.
