NTV Telugu Site icon

ఆ పర్యాటకులను ఆకర్షిస్తున్న కాశ్మీర్

జమ్మూకాశ్మీర్‌ మంచు సోయగాలను చూసేందుకు అందరికీ ఆసక్తిగానే ఉంటుంది. అయితే శనివారం జమ్మూకాశ్మీర్ టూరిజం రోడ్‌షో నిర్వహించింది. ఈ సందర్భంగా పట్నిటాప్ టూరిజం డెవలప్‌మెంట్ అథారిటీ సీఈఓ షేర్ సింగ్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం జూన్ నుండి ఇప్పటివరకు 5.5 లక్షల మంది దేశీయ పర్యాటకులు జమ్మూకాశ్మీర్‌ను సందర్శించారని, వీరిలో 10 శాతం మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. జమ్మూకాశ్మీర్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టూర్ ఆపరేటర్లే కాకుండా, తెలుగు పర్యాటకుల కోసం స్థానిక హోటల్‌లు, ధాబాలు ఇప్పుడు ఇడ్లీ, సాంబార్ ఇతర సాధారణ దక్షిణ భారతీయ వంటకాలను అందిస్తున్నాయని ఆయన వెల్లడించారు. లాక్‌డౌన్ తర్వాత దక్షిణాది రాష్ట్రాల నుంచి జమ్మూ కాశ్మీర్‌కు భారీగా పర్యాటకులు తరలివచ్చారని తెలిపారు.

మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించడమే కాకుండా, చాలా మంది పర్యాటకులు ఇప్పుడు జమ్మూలోని పట్నిటాప్‌, భదర్వా, సనాసర్ మరియు ఇతర ప్రదేశాలను సందర్శించడాని అనువైన స్థలంగా ఎంచుకుంటున్నారని, అదేవిధంగా, కాశ్మీర్‌లో ఎక్కువ మంది పర్యాటకులు గురేజ్, సోన్‌మార్గ్, పహల్గామ్ తో పాటు ఇతర ప్రాంతాలను సందర్శిస్తున్నారని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ టూరిజం ఇప్పుడు గురేజ్, కోకెర్‌నాగ్, బసోలి, వుల్లార్, అహర్బల్, క్రిమ్చి టెంపుల్స్, కొంగ్‌వాట్, రంజిత్ సాగర్ డ్యామ్, ధిమ్‌గఢ్ ఫోర్ట్ ఇతర ప్రాంతాలతో సహా 75 కొత్త పర్యాటక ప్రాంతాలను గుర్తించిందని, ఈ ప్రదేశాలన్నీ రాఫ్టింగ్, పర్వతారోహణ, ట్రెక్కింగ్ మరెన్నో సహా తీర్థయాత్ర, సాహస పర్యాటకాన్ని అందిస్తాయని ఆయన అన్నారు.

పర్యాటకులు హోం స్టేలు, బోట్ హౌస్‌ల ద్వారా స్థానిక ప్రజల ఆతిథ్యాన్ని అనుభవించవచ్చని గుమర్గ్ టూరిజం డెవలప్‌మెంట్ అథారిటీ సీఈవో జహూర్ అహ్మద్ రైనా తెలిపారు. టూరిస్టుల కోసం ప్రత్యేక పోలీసులు బృందాలు, ఎస్‌హెచ్‌ఓలను మోహరించినందున పర్యాటకులు భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గత కొన్ని నెలల్లో, అనేక మంది ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, వీఐపీలు, సీనియర్ అధికారులతో సహా 19 ప్రతినిధి బృందాలు జమ్మూకాశ్మీర్‌లోని వివిధ జిల్లాలను సందర్శించాయని ఆయన వెల్లడించారు.