మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ఉంది.. సంప్రదింపులతోనే సమస్యలను పరిష్కరించుకోవాలంటూ కీలక సూచనలు చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ… హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో జరిగిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కాలయాపన జరుగుతుందని.. విస్తృత సంప్రదింపులతో ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. కోర్టులకు వచ్చేముందే మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చని సూచించిన సీజేఐ.. మధ్యవర్తిత్వం ద్వారా తక్కువ సమయంలో పరిష్కారాలు లభిస్తాయని.. కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉండాలన్నారు.. మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఇక, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్ సరైన వేదిక అని చెప్పారు సీజేఐ ఎన్వీ రమణ.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపిన ఆయన.. హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటుకు ఎంపిక చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు.. ఇక్కడ ఫార్మా, ఐటీ, ఇతర పరిశ్రమలు ఉన్నాయి.. హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని.. ఈ సెంటర్ ఏర్పాటు ఆలోచన గురించి కేసీఆర్ తో ప్రస్తావించినప్పుడు సానుకూలంగా స్పందించారని తెలిపారు.. సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ సహకారం లేకుండా సెంటర్ ఏర్పాటు సాధ్యం అయ్యేది కాదని.. డిసెంబర్ 18 న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ హైదరాబాద్ లో ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.