(సెప్టెంబర్ 2న జీవిత రాజశేఖర్ పుట్టినరోజు)
“కార్యేషు దాసి… కరణేషు మంత్రి…” అంటూ శాస్త్రకారులు స్త్రీని షట్కర్మయుక్తగా చిత్రీకరించారు. చిత్రసీమలో అలాంటివారు అరుదుగా కనిపిస్తారు. నటి, దర్శకురాలు జీవితను చూస్తే ఆమె నిజంగానే షట్కర్మయుక్త అనిపిస్తారు. తన భర్త డాక్టర్ రాజశేఖర్ ను హీరోగా నిలపడంలోనూ, స్టార్ హీరోని చేయడంలోనూ, అతని విజయానికి వెన్నెముకగా నిలచి జీవిత సాగుతున్నారు. తెలుగు చిత్రసీమలో అలా సాగిన వారిలో కృష్ణ, విజయనిర్మల దంపతులు ముందుగా గుర్తుకు వస్తారు. తరువాత జీవిత, రాజశేఖర్ ఆదర్శంగా కనిపిస్తారు. సెంట్రల్ సెన్సార్ బోర్డ్ రివైజింగ్ కమిటీ తెలుగు రీజియన్ కు ఛైర్ పర్సన్ గా జీవిత వ్యవహరిస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’కు ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్నారు. ఆమె విజయం వెనుక రాజశేఖర్, ఆయన సక్సెస్ కు దన్నుగా జీవిత పరస్పరం నైతికబలం అందించుకుంటూ ఆదర్శంగా సాగుతున్నారు.
తమిళనాట బహుముఖ ప్రజ్ఞతో సాగిన టి.రాజేందర్ రూపొందించిన ‘ఉరవై కథా కిలి’ అనే తమిళ చిత్రంతో జీవిత తెరంగేట్రం చేశారు. తరువాత “సెల్వి, నానే రాజా నానే మంత్రి, ఇలమై, ఎంగ కురళ్, ఆయిరమ్ కన్నుదయాల్, ధర్మపత్ని” వంటి తమిళ చిత్రాలలో నటించి అలరించారు. కె.వాసు దర్శకత్వంలో రూపొందిన ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టారు జీవిత. “తలంబ్రాలు, బావామరదుల సవాల్, జానకిరాముడు, స్టేషన్ మాస్టర్, ఆహుతి, అన్నాచెల్లెలు, మంచివారు మావారు, అంకుశం” చిత్రాలలో నటించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రాజశేఖర్ తో కలసి ఆమె నటించిన “తలంబ్రాలు, ఆహుతి, అంకుశం” చిత్రాలు నటిగా మంచి పేరు సంపాదించి పెట్టాయి. రాజశేఖర్ హీరోగా ‘మగాడు’ చిత్ర నిర్మాణంలో జీవిత పాలు పంచుకున్నారు. రాజశేఖర్ హిట్ పెయిర్ గా సాగిన జీవిత, ఆయనతో వివాహం అయిన తరువాత సినిమాలకు దూరంగా జరిగారు. భర్త స్టార్ హీరోగా నిలవడానికి ఓ భార్యగా జీవిత ఎంతో నైతిక బలం అందించారు.
రాజశేఖర్ హీరోగా రూపొందిన ‘శేషు’ చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించిన జీవిత, ఆ తరువాత భర్త హీరోగా రూపొందిన “ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే, మహంకాళి” చిత్రాలకూ మెగాఫోన్ పట్టుకున్నారు. జీవిత, రాజశేఖర్ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు – శివానీ, శివాత్మిక. వారిద్దరూ కన్నవారి బాటలోనే పయనిస్తూ నటనలో అడుగు పెట్టారు. రాజశేఖర్ ఇప్పటికీ హీరో పాత్రలే వేస్తూ సాగుతున్నారు. ఆయన పయనంలో సదా జీవిత నీడగానే ఉన్నారు. అలాగే తమ పిల్లల నటజీవితం బాగుండేందుకు తగిన ప్రణాళికలు రచిస్తున్నారు. జీవిత, రాజశేఖర్ దంపతులు చిత్రసీమలో అందరికీ సన్నిహితంగా సాగుతున్నారు. ఆపదలో ఉన్నవారికి చేతనైన సాయం అందించేందుకు ఈ దంపతులు ఎప్పుడూ ముందుంటారు.