బంగాళాఖాతంలో జవాద్ తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఈ తుఫాన్ ఉత్తరాంధ్ర తీరం వద్దకు దూసుకువస్తోంది. ఉత్తర దిశగా కదులుతూ ఆదివారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫాన్ తీరం దాటిన తర్వాత బంగాళాఖాతం వైపు వెళ్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో రానున్న మూడు రోజులు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 80-100 కి.మీ. వేగంతో కూడిన ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు రెడ్ అలర్ట్, గోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
Read Also: ఎక్కడా ప్రాణనష్టం జరగకూడదు: సీఎం జగన్
కాగా తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే ఎన్డీఆర్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రత్యేక అధికారి అరుణ్‌కుమార్ సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. నంబర్: 08942 240557. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోని 38 మండల కేంద్రాల్లో కంట్రోల్ రూంలను అధికారులు ఏర్పాటు చేశారు. అటు జవాద్ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు విశాఖ నేవీ సిద్ధంగా ఉంది. ఈ మేరకు ప్రత్యేక సహాయకచర్యల కోసం 13 ఫ్లడ్ రిలీఫ్ టీమ్స్ రంగంలోకి దిగాయి. విశాఖ డీఆర్ఎం ఆఫీసులో కంట్రోల్ రూం నంబర్ 0891-2590100 ఏర్పాటు చేశారు. విజయనగరం, రాయగడ రైల్వేస్టేషన్‌లలో హెల్ప్‌లైన్లు కూడా పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు.