తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల చుట్టే తిరుగుతోంది. సహజంగానే ఈ ఎన్నికలకు సంబంధించిన ఏ చిన్న అంశమైనా ప్రజలకు ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. ఈ బైపోల్ నిర్వహణలో ఈవీఎంలను ఉపయోగిస్తారా? లేదంటే బ్యాలెట్ పద్దతా అన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది. దీనిపై పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ కూడా జరుగుతోంది. కేసీఆర్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ..తమ డిమాండ్లు హైలైట్ అయ్యేలా వివిద వర్గాల నుంచి పెద్ద సంఖ్యలో పోటీ చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులు, ప్రైవేట్ టీచర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు పలు కుల సంఘాల నేతలు ఇప్పటికే ఈ విషయం ప్రకటించాయి.
అయితే ఇది ఇప్పుడే తేలే విషయం కాదు. ఈవీఎంలపై ఉప ఎన్నికలు నిర్వహించాలా, లేదంటే పేపర్ బ్యాలెట్ పద్దతిలోనా అనే దానిపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల విభాగం అధికారులు అంటున్నారు. అయితే ఏ పద్దతిని అనుసరించాలన్నది ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నోటాతో సహా పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య 385 మించకపోతే ఈవీఎంలను ఉపయోగిస్తారు. పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం పేపర్ బ్యాలెట్ తప్పదు. హుజూరాబాద్ నియోజకవర్గానికి 2018 లో జరిగిన ఎన్నికల్లో పది మంది అభ్యర్థులు పోటీ చేయగా, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది మంది అభ్యర్థులు పోటీపడ్డారు. కానీ ఈసారి పరిస్థితి వేరుగా ఉండబోతోంది.
నాగార్జున సాగర్ ,దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఈవీఎంలపై నిర్వహించగా, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లు , 150 వార్డులకు ఎన్నికలు పేపర్ బ్యాలెట్‌లో జరిగాయి.
కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా 2019 లోకసభ ఎన్నికల్లో 170 మంది పసుపు రైతులు బరిలో నిలిచారు. తమ డిమాండ్లను హైలైట్ చేయటానికే వారు ఆ పనిచేశారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ కూతురు సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత పరాజయం పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆమెపై విజయం సాధించారు. రెండేళ్ల తరువాత హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీచేసే అవకాశం ఉంది.
హుజూరాబాద్ ఉప ఉన్నికల్లో 1000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 30 మంది నిరుద్యోగులు బరిలో దిగుతామని ప్రకటించారు. వీరు మాత్రమే గాక షర్మిల మద్దతుతో ఇంకా చాలా మంది ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. వీలైనంత ఎక్కువ మంది నామినేషన్లు వేయాలని షర్మిల ఇప్పటికు నిరుద్యోగులను కోరారు. నామినేషన్ వేస్తే పార్టీ తరఫున ఆర్థికంగా సాయం అందిస్తామని కూడా షర్మిల ప్రకటించారు. దీనిని బట్టి వచ్చే హుజూరాబాద్ బైపోల్స్ బ్యాలెట్ పద్దతిలో జరిగే అవకాశాలే ఎక్కువని అర్థమవుతోంది.
భూకబ్జా ఆరోపణలపై ఈటల రాజేందర్‌ని సీఎం కేసీఆర్ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయటం ఈ ఎన్నికలకు దారితీసింది. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దాంతో ఈ ఉప ఎన్నికల ప్రతిష్టాత్మకంగా మారింది. టీఆర్ఎస్ తన అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ప్రకటించారు. ఈటల ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ ఇంకా తన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఏదేమైనా హుజూరాబాద్ ఉప ఎన్నిక రాబోవు రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారనుంది.
