NTV Telugu Site icon

ఈటల గెలుపు ఖాయమా..?

etela rajender

గత 5 నెలలుగా సాగిన ఉత్కంఠకు నేడు తెరపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్న హుజురాబాద్‌ ఉప ఎన్నికకు పోలింగ్‌ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయడంతో టీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిననాటి నుంచి ఈటల రాజేందర్‌ హుజురాబాద్‌ నియోజవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోపక్క టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు హుజురాబాద్‌ కేంద్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు.

అంతేకాకుండా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు హుజురాబాద్‌ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ వచ్చిననాటి నుంచి మంత్రి హరీశ్‌రావు నియోజకవర్గాన్నే అంటిపెట్టుకొని ఉన్నారు. ప్రతి గ్రామానికి ఒకరిద్దరు ఎమ్మెల్యేలను ఇంచార్జీలుగా పెట్టి మరీ గులాబీ జెండా ఎగరవేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయం మీద సర్వే చేసినా.. ఫలితాలన్నీ వారిని తికమకపెట్టాయి. దీంతో బీజేపీ, టీఆర్‌ఎస్‌ ల మధ్య అసలైన పోటీ ఉండబోతోందని వార్తలు మొదటినుంచే వినిపిస్తున్నాయి.

ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు, మద్యం పంచుతున్నారనే వీడియోలు కూడా వైరల్‌గా మారాయి. కొందరికి డబ్బుల అందలేదని రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే.. ఓటర్ల మనుసులో ఏముంది..? అనే విషయానికి వస్తే నియోజకవర్గంలోని పలు చోట్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ నేతలపై విముఖత స్పష్టంగా కనిపిస్తుంది. పోలింగ్‌ కేంద్రాల వద్దకు వచ్చిన టీఆర్ఎస్‌ నేతలను గ్రామస్థులే అడ్డుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తోందంటూ.. నినాదాలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. హుజురాబాద్‌ గడ్డమీద ఈటల గెలుపు ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి..