NTV Telugu Site icon

సోలో ఫైటే సో బెటరూ.. అని ఈటల భావిస్తున్నారా..?

అధికార పార్టీలో ఉన్నా.. అనుకోని పరిస్థితుల్లో మరో పార్టీలోకి చేరినా.. తన రూటే సెపరేటు.. అని ఇతరులు అనేలా నడుచుకుంటున్నారు.. మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. కొంత కాలం క్రితం వరకూ.. గులాబీ జెండా మోసి.. అజెండానూ అమలు చేసిన ఆయన.. అనుకోని పరిస్థితిలో కమలం బాట పట్టారు. కాషాయం గూటికి చేరారు. కానీ.. తన ఒరిజినాలిటీ మాత్రం కోల్పోయేది లేదు.. అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నారు.

ఒక్కసారి.. ఈటల టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరినంతవరకూ జరిగిన పరిణామాలు గమనిస్తే.. భూ కబ్జాల ఆరోపణలు.. అనంతరం మంత్రి పదవి నుంచి బర్తరఫ్.. తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా.. అనంతరం బీజేపీ తరఫున హుజూరాబద్ అభ్యర్థిగా జనాల్లో పర్యటన. ఇంతటి క్రమంలో.. ఈటల ఎక్కడా తన వ్యక్తిగత పేటెంట్ మాట అయిన ఆత్మ గౌరవాన్ని కోల్పోకుండానే ముందుకు పోతున్నట్టు కనిపిస్తోంది.

ఎందుకంటే.. ఈటల ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరిన సందర్భం నుంచి ఇప్పటివరకూ.. తాను ఒక్కడినే.. అన్న భావనలో ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తున్నారు. హుజూరాబాద్ లో పాదయాత్ర చేసినా.. జనాలను కలిసినా.. పార్టీ అగ్రనేతలను ఆయన అంతగా కలుపుకొనిపోయింది లేదు.. కలిసి నడిచిందీ లేదు. అందుకు తగ్గట్టుగానే.. బీజేపీ రాష్ట్ర ముఖ్యనేతలు సైతం ఆయన వెంట వెళ్లేందుకు అంతగా ముందుకు పోయిందీ లేదు.

ఈ పరిణామాలు అన్నిటికీ తోడుగా.. బీజేపీ తెలంగాణకు చెందిన ఇతర నేతలు చేస్తున్న పోరాటాల్లోనూ ఈటల కలిసిందీ లేదు. ఇదంతా చూస్తుంటే.. ఎవరితోనూ కలవకుండా.. తనకు తానుగానే హుజూరాబాద్ లో సొంత ఇమేజ్ తో గెలవాలన్న కసిని ఆయన ప్రదర్శిస్తున్నట్టుగా ఉందని ఈటల అనుచరులు అంచనా వేస్తున్నారు. అందుకే.. ఒక్కడే నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలు పర్యటిస్తున్న తీరును పరిగణలోకి తీసుకోవాలంటున్నారు.

ఇదంతా చూస్తుంటే.. సోలో ఫైటే సో బెటరూ.. అన్నట్టుగా ఈటల రాజేందర్ వైఖరి ఉందని.. రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. కాషాయ కండువా వేసుకున్నా సరే.. తన రూట్ లో తాను వెళ్తున్నట్టు అభిప్రాయపడుతున్నారు.