NTV Telugu Site icon

నేను రోజూ గోమూత్రం తాగుతా.. అందుకే నాకు క‌రోనా రాలేదు..

Pragya Thakur

ఓవైపు క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం సృష్టిస్తోంది.. రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతూ రాగా.. మృతుల సంఖ్య భారీగానే ఉంది. ఈ స‌మ‌యంలో.. బీజేపీ ఎంపీ ప్ర‌గ్యా ఠాకూర్ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారిపోయాయి… వ్యాక్సిన్లు, రెమ్‌డెసివిర్లు ఏమీ అక్కర లేదు.. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు గోమూత్రం తాగితే చాల‌ని ఆమె సెల‌విచ్చారు.. అది కూడా దేశీ గోమూత్రం అయితేనే ఫలితం ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు.. అంతేకాదు.. తాను రోజూ గోమూత్రం తాగుతాన‌ని.. అందుకే కరోనా మ‌హ‌మ్మారి ఇంతవరకు తన దరి చేర‌లేద‌న్నారు బీజేపీ ఎంపీ.. ఇక‌, ఈ మాత్రం మన వైద్యనిపుణులకు తెలియకపాయే.. రోజూ గోమూత్రం తాగితే కరోనా వల్ల ఊపిరి తిత్తుల్లో ఏర్పడ్డ జబ్బు నయమైపోతుందంటూ ఉచిత స‌ల‌హాలు ప‌డేశారు. మ‌హ‌మ్మారిని అదుపుచేయ‌డానికి భార‌త్ పోరాటం చేస్తున్న స‌మ‌యంలో.. బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.

గో మూత్రం ఒక ప్రాణ రక్షకుడు.. అంటూ చెప్పుకొచ్చిన‌ బీజేపీ ఎంపీ.. రెండేళ్ల క్రితం, ఆవు మూత్రం మరియు ఇతర ఆవు ఉత్పత్తుల మిశ్రమం తన క్యాన్సర్‌ను నయం చేసిందని కూడా పేర్కొన్నారు.. కాగా, కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో 2020 డిసెంబ‌ర్‌లో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేశారు ప్రగ్యా ఠాకూర్.. కానీ, కోవిడ్‌గా నిర్ధార‌ణ కాలేదు. మ‌రోవైపు.. కోవిడ్ ఫ‌స్ట్ వేవ్ స‌మ‌యంలో.. గోవు పేడ పూసుకుంటే కోవిడ్ రాదు.. బుర‌ద రుద్దుకుంటే క‌రోనా సోక‌దు.. గో మూత్రం తాగితే.. మ‌హ‌మ్మారి చెంత‌కురాదు అంటూ కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే… వారిలో కొంత‌మంది కోవిడ్ బారిన‌ప‌డి ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇక‌, గో మాత్రం గానీ, ఆవుపేడ గానీ క‌రోనా రాకుండా చూస్తాయని శాస్త్రీయంగా నిరూపితం కాలేద‌ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అనేకమార్లు హెచ్చ‌రిస్తూ వ‌చ్చింది.