Site icon NTV Telugu

న్యూ ట్రెండ్… సైకిల్‌పై పెళ్లి మండపానికి వెళ్లిన హైదరాబాదీ వరుడు

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మరపురాని అనుభూతి. పెళ్లి లాంటి క్షణాలు జీవితంలో ఒక్కసారే వస్తాయి. అందుకే కొందరు ఆ క్షణాలను గుర్తుండిపోయేలా మలుచుకుంటారు. హైదరాబాద్‌కు చెందిన దినేష్ అనే వ్యక్తి కూడా తన పెళ్లిని గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకోవాలని భావించాడు. దీంతో పాటు సామాజికంగానూ మంచి ఆలోచన చేశాడు. వివరాల్లోకి వెళ్తే… హ్యాపీ హైదరాబాద్ సైక్లింగ్ సంఘం వ్యవస్థాపక సభ్యుడు దినేష్‌కు ఇటీవల పెళ్లి కుదిరింది. దీంతో పెద్దలు ఘనంగా పెళ్లి చేయాలని నిర్ణయించారు.

Read Also: ఈ కారుకు ఒక్క‌సారి ఛార్జింగ్ చేస్తే… వెయ్యి కిమీ ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు

సాధారణంగా వివాహ వేదికకు వరుడు, వధువు కార్లలో వెళ్తుంటారు. వెరైటీగా వెళ్లాలనిపిస్తే కొందరు గుర్రపు బండ్లను అద్దెకు తీసుకుని కూడా వెళ్తారు. అయితే దినేష్ మాత్రం అలా ఆలోచించలేదు. కాలుష్యానికి కారణమయ్యే మోటార్ వాహనాల బదులు ఏకో ఫ్రెండ్లీగా ఉండే సైకిల్‌పై పెళ్లి వేదిక వద్దకు వెళ్లాలని భావించాడు. అంతేకాకుండా సైకిల్ తొక్కితే మంచి ఆరోగ్యంగానూ ఉండొచ్చని సమాజానికి ఓ సందేశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీంతో దినేష్ స్టైలుగా సైకిల్ తొక్కుతూ వివాహ వేదికకు వెళ్లడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ… తన సైక్లింగ్ కమ్యూనిటీ స్నేహితులు సైకిళ్లపై ఊరేగింపు నిర్వహించారని… ఇలా చేయడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపాడు. మరోవైపు నూతన జంటకు సైక్లింగ్ కమ్యూనిటీ స్నేహితులందరూ కలిసి స్టైలుగా ఉండే సైకిల్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ నేపథ్యంలో వివాహం కాగానే వధువును కూడా సైకిల్‌పైనే ఇంటికి తీసుకువెళ్లాలని వారు కోరడం విశేషం.

Exit mobile version