గత అసెంబ్లీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ నాయకులు హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చుతామంటూ ప్రకటనలు చేశారు. యూపీ సీఎం యోగి కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చి ఈ విషయాన్ని ఉద్ఘాటించారు. దీంతో ఈ విషయంపై నిరసన జ్వాలలు కూడా రగిలాయి. అయితే తాజాగా భాగ్యనగర్ పేరుతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ట్వీట్ చేయడంతో మరోసారి ట్విట్టర్ వేదికగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో హైదరాబాద్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) మూడు రోజుల సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో “సామాజిక జీవితంలోని వివిధ రంగాలలో పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ స్ఫూర్తితో వివిధ సంస్థల ముఖ్య కార్యకర్తల సమన్వయ్ బైఠక్ (సమన్వయ సమావేశం) 2022 జనవరి 5 నుండి 7వ తేదీ వరకు తెలంగాణలోని భాగ్యనగర్‌లో జరగనుంది” అని ఆర్‌ఎస్‌ఎస్ ట్వీట్‌లో పేర్కొంది. దీంతో ట్విట్టర్‌లో మరోమారు ఈ విషయం దుమారం రేపుతోంది.
