NTV Telugu Site icon

హుజురాబాద్‌ ఈటల కంచుకోట..?

హుజురాబాద్‌ ఈటల రాజేందర్‌ కంచుకోట అనడంలో సందేహం లేదనిపిస్తోంది. ఎందుకంటే.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరి హుజురాబాద్‌ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. అయితే హుజురాబాద్‌ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కేసీఆర్‌. ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా దళిత బంధు, మహిళలకు మహిళా సంఘాల భవనాలకు భారీ నిధుల మంజూరు లాంటి సంక్షేమ పథకాలను హుజురాబాద్‌ ఓటర్ల ముందు పెట్టారు.

మంత్రి హరీశ్‌రావుకు హుజురాబాద్‌ ఇంచార్జీ బాధ్యతలు అప్పజెప్పారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వచ్చిననాటి నుంచి హరీశ్‌రావు హుజురాబాద్‌లోనే ఉండి ఒక్కో గ్రామానికి ఒక్కో ఎమ్మెల్యేను పెట్టి మరీ ప్రచారం నిర్వహించారు. సాక్షాత్తు సీఎం కేసీఆర్‌యే వచ్చి ప్రచారం నిర్వహించేందుకు సన్నద్ధమైనప్పటికీ.. ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోవడంతో కేసీఆర్‌ హుజురాబాద్‌ గడ్డమీద అడుగుపెట్టలేకపోయారు.

అయితే మొత్తానికి ఈ ఉప ఎన్నిక బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ కాకుండా.. ఈటల వర్సెస్‌ టీఆర్‌ఎస్‌లా మారింది. కేసీఆర్‌ తన అనుచర బలగాన్ని మొత్తం ఈ ఉప ఎన్నికలో వినియోగించారనే వాదన కూడా వినిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ శ్రేణులతో పాటు కేసీఆర్‌ సైతం ఈ ఉప ఎన్నికలో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు. అయితే ఈ ఉప ఎన్నికకు అక్టోబర్‌ 30న పోలింగ్‌ జరుగగా నేడు ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

కౌంటింగ్‌ మొదటి నుంచి ఈటల రాజేందర లీడింగ్‌లోనే ఉన్నారు. ప్రస్తుతం 9 రౌండ్‌ల ఫలితాలు రావడంతో వాటిలో 8వ రౌండ్‌ మినహా మిగితా అన్నీ రౌండ్లలో ఈటలే ఆధిక్యంలో ఉన్నారు. ఇదే చివరి వరకు కొనసాగితే.. ఈటల గెలుపు తథ్యమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిబట్టి చూస్తుంటే.. హుజురాబాద్‌ ఈటల రాజేందర్‌ కంచుకోట.. అన్నట్లుగా కనిపిస్తోంది.