ఏపీలో సినిమా టికెట్ల రేట్ల వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా అయితే కనిపించడంలేదు. టిక్కెట్ల రేట్ల కారణంగా ఇప్పటికే వందల సంఖ్యలో థియేటర్లు మూతపడ్డాయి. సౌతిండియాలో అతిపెద్ద స్క్రీన్ కూడా మూతపడింది. ఈ ఇష్యూపై ఇటీవల హీరో నాని సంచలన కామెంట్స్ చేయగా తాజాగా హీరో నిఖిల్ స్పందించాడు. ఏపీలో థియేటర్లు మూతపడటం చాలా బాధాకరమన్నాడు. ఏపీలో చాలా చోట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టిక్కెట్ రేటు రూ.20గా ఉందని.. రైలులో కంపార్టుమెంట్ల ఆధారంలో ప్రీమియం లేదా ఫ్లెక్సిబుల్ రేట్లను ఎలా అనుమతిస్తున్నారో సినిమా థియేటర్లలోనూ బాల్కనీ, ప్రీమియం విభాగాల్లో ఫ్లెక్సిబుల్ టిక్కెట్ రేట్లను అనుమతించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరాడు.
థియేటర్లు తనకు దేవాలయంతో సమానమని నిఖిల్ అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే ప్రజలకు థియేటర్లు ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తాయన్నాడు. సినిమా పరిశ్రమను ఆదరిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు నిఖిల్ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఏపీ ప్రభుత్వం కూడా త్వరలోనే థియేటర్లకు పూర్వవైభవాన్ని తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు నిఖిల్ చెప్పుకొచ్చాడు.
