దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడానికి ముందు సోనూసుద్ సినీ నటుడుగానో.. విలన్ గానో.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానో మాత్రమే తెలుసు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో కరోనాను అరికట్టేందుకు ఉన్నట్టుండి ఒక్కసారిగా లాక్డౌన్ విధించారు. ఇది మంచి నిర్ణయమే అయినా ఆ సమయంలో కొందరి పాలిటశాపంగా మారింది. ముఖ్యంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి సమయంలో సోనూసూద్ వారికి అండగా నిలిచాడు. ప్రత్యేక బస్సులు, రైళ్లను ఏర్పాటు చేసి వాళ్లను తమ సొంత ఊళ్లకు పంపించారు. దీంతో అప్పటి వరకు విలన్ గా ఉన్న సోనుసూద్ ఒక్కసారిగా రియల్ హీరోగా మారిపోయాడు.
ఆ తర్వాత కూడా సోనూసూద్ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తన పేరిట ట్రస్టును ఏర్పాటు చేసి వచ్చిన విరాళాలతో పేద ప్రజలకు సాయం చేస్తున్నాడు. ఆయన సేవాగుణం చూసి కోట్లాది మంది ప్రజలు ఆయనకు అభిమానులుగా మారిపోయాయి. ఇటీవల ఆయన పుట్టిన రోజు వస్తే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫ్యాన్స్ సేవా కార్యక్రమాలతో సందడి చేశారు. సేవా కార్యక్రమాలతో అందరి మనస్సును దోచుకుంటున్న సోసూసూద్ కు చెందిన ఇళ్లపై గత రెండ్రోజులుగా ఐటీశాఖ దాడులు చేస్తోంది. దీంతో ఈ ఐటీ దాడులు కాస్తా వివాదాస్పదంగా మారుతున్నాయి.
కరోనా సమయంలో సోనూసూద్ చేసిన సేవా కార్యక్రమాలకు మంచి గుర్తింపు వచ్చింది. ఇదే సమయంలో బీజేపీ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తాయి. అప్పట్లోనే అతడిపై చర్యలు తీసుకుంటే వ్యతిరేకత వస్తుందని భావించిన బీజేపీ పెద్దలు సమయం కోసం వేచిచూశారనే టాక్ విస్తుంది. ఇంత హఠాత్తుగా సోనూసూద్ కు చెందిన ఇళ్లపై ఐటీ దాడులు చేయడం వెనుక కుట్ర కోణం ఉందనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సోనూసూద్ ఢిల్లీలో అధికారంలో ఉన్న సీఎం క్రేజీవాల్ తో సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమానికి సైతం ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కారుకు బీజేపీకి మధ్య వార్ నడుస్తోంది. ఇక్కడ అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. అయితే కేజ్రీ ముందు బీజేపీ పప్పులు ఉడకటం లేదు. దీనికితోడు సోనూసూద్ కేజ్రీ సర్కారుకు మద్దతుగా ఉంటుండటంతో వారి కోపానికి కారణమైనట్లు తెలుస్తోంది. మరోవైపు త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సోనూసూద్ ఆప్ కు ప్రచారం చేయనున్నారని బీజేపీ భావిస్తుందట. ఈనేపథ్యంలోనే ఢిల్లీలో ఆయన చెందిన ఇళ్లపై ఐటీ దాడులు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే సోనూసూద్ లక్నోలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ సంస్థపై పన్ను ఎగవేత ఆరోపణలున్నాయి. ఈక్రమంలోనే ఆ సంస్థతోపాటు ఏకకాలంలో సోనూసూద్ ఇళ్లపై కూడా ఐటీ శాఖ దాడులు చేసినట్లు సమాచారం అందుతోంది. ఏదిఏమైనా దేశంలో కోట్లకు కోట్లకు పన్నులు ఎగ్గొట్టే బడానేతలను ప్రభుత్వం విడిచిపెట్టి ప్రజలకు సేవ చేస్తున్న సోనూసూద్ లాంటి వ్యక్తులపై దాడులు చేయించడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో ఐటీ శాఖ, బీజేపీ సర్కారు తీరును తప్పుబడుతూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. ఈ వివాదంపై బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారో వేచిచూడాల్సిందే..!