Site icon NTV Telugu

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. హై అలర్ట్ ప్రకటించిన జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది… దాదాపు రెండు గంటలకు పైగా వర్షం దంచికొడుతోంది… బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, మలక్‌పేట్, నాగోల్, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, బడంగ్‌పేట్‌, మెహిదీపట్నం, అత్తాపూర్‌, రాజేంద్రనగర్‌, కిస్మత్‌పూర్‌, శంషాబాద్‌ సహా తదితర ప్రాంతాల్లో జోరు వాన కురుస్తోంది.. దీంతో.. పలుచోట్ల చెరువులను తలపిస్తున్నాయి రోడ్లు, లోతట్టు ప్రాంతాలకు వర్షం చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.. దీంతో.. అప్రమత్తమైన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ).. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.. అనవసరంగా బయటకు రావొద్దని.. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచిచింది.

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధితో పాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనూ కుండపోత వర్షం కురుస్తోంది… ఇక, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో.. వర్షం దంచికొట్టడంతో.. వాహనదారులు, హైదరాబాదీలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది.. మరోవైపు రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌ బృందాలు.. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు.. చెరువులను తలపిస్తున్న రోడ్ల నుంచి నీటిని పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని సైదాబాద్, చంపాపేట్‌, కర్మాన్ ఘాట్‌, ఉప్పల్, నాచారం, తార్నాక, బషీర్ బాగ్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బేగంబజార్, సుల్తాన్‌బజార్, అంబర్‌పేట్‌ తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది.. ఇక, ముసరాంబాగ్‌ బ్రిడ్జి పై నుంచి మూసీ నీరు ప్రవహిస్తోంది.. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. ఇప్పటికే ఎల్బీనగర్‌, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్‌లో రెండు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కాగా.. సరూర్‌నగర్‌, కూకట్‌పల్లి, చందానగర్ ప్రాంతాల్లో ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదు అయ్యింది.. మరో గంటపాటు కూడా వర్షం కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

Exit mobile version