NTV Telugu Site icon

హైదరాబాద్‌లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు..

హైదరాబాద్‌లో భారీ వర్షం దంచి కొట్టింది. మూడు గంటల పాటు కురిసిన వానకు… జంటనగరాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో… మోకాళ్ల లోతు నీరు చేరింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.. పాతబస్తీ బహదూర్‌పురా వద్ద రహదారిపైకి భారీగా వరద నీరు రావడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మాదాపుర్ శిల్పారామం సమీపంలో ప్రధాన రహదారిపై భారీగా చేరిన వరద నీరడంతో పాటు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షంతో రహదారులు చెరువులను తలపించాయి.

కృష్ణానగర్ బీ బ్లాక్‌లో వరద నీరు ముత్తెందింది. ఓ యువకుడు అందులో కొట్టుకుపోతుండడంతో స్థానికులు కాపాడారు. నీటి ఉధృతికి మరో వ్యక్తి కొట్టుకుపోతుండటంతో… అక్కడే ఉన్న స్థానికులు రక్షించారు. 19 జీహెచ్ఎంసీ డిజాస్టర్ బృందాలు రంగంలోకి దిగి.. రోడ్లపై నిలిచిన నీటిని మోటార్ల సాయంతో తొలగించాయి. నగరంలోని ఖైరతాబాద్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, లక్డికాపూల్‌, నాంపల్లి, యూసుఫ్‌గూడ, శ్రీనగర్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కూకట్‌పల్లి, నిజాంపేట, కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

నీటి ఉధృతికి కొట్టుకుపోతున్న బైక్‌ను… పట్టుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించి విఫలమయ్యాడు. మరో చోట గూరగాయల బండి… వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఎస్సార్ నగర్, అమీర్‌పేట రోడ్లలో ఎక్కడ చూసినా వరద నీరే దర్శనమిచ్చింది. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, ఎల్బీనగర్‌ పరిధిలో భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ ఇప్పటి వరకు నమోదైన వర్షపాతం అత్యధికంగా షేక్ పేట్‌లో 9.8 సెంటీమీటర్లు నమోదు కాగా.. కూకట్‌పల్లిలో 9.6 సెంటీమీటర్లు, శేరిలింగంపల్లిలో 8.8 సెంటీమీటర్లు, సరూర్ నగర్‌లో 8.3 సెంటీమీటర్లు, ఖైరతాబాద్‌లో 7.6 సెంటీమీటర్లు.. ముసాపేటలో 9.6 సెంటీమటర్లు, మాదాపూర్‌ 8.7 సెంటీమీటర్లు, యూసుఫ్‌గూడ 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.. అయితే, జూబ్లీహిల్స్‌లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెబుతున్నారు.