రాజకీయాల్లో ఎవరిమీదనైనా కామెంట్లు చేయాలన్నా, నిరసన తెలపాలన్నా సీపీఐ నేత రూటే సపరేటు. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలు, చెప్పులపై జీఎస్టీ విధించడం సిగ్గుచేటు అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అంటున్నారు. తిరుపతిలో ఆయన కేంద్రంపై తీరుకి నిరసనగా తన చెప్పును తలపై పెట్టుకున్నారు. చెప్పులపై పన్ను విధించడంపై నిరసన తెలపడం తప్పేంటని ప్రశ్నించారు. జీఎస్టీతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చేసామాన్య ప్రజానీకం వాడే పాదరక్షలపై కూడా జీఎస్టీని పెంచడం ఏంటన్నారు.చెప్పులపై జీఎస్టీ తగ్గించకుంటే బీజేపీ నేతలకు చెప్పులతో స్వాగతం పలుకుతామన్నారు. వారికి వంత పాడితే రాష్టంలోను అదే చేస్తామన్నారు.
ప్రతి ఒక్కరికీ అవసరమయ్యే పాదరక్షలు, దుస్తులపై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలని కేంద్రం ప్రతిపాదించిందన్నారు. పాదరక్షలపై జీఎస్టీ పెంచితే సామాన్యులు చెప్పులు ధరించకుండా తలపై పెట్టుకుని తీసుకెళ్లాల్సి వస్తుందని చెప్తూ చెప్పును తన తలపై పెట్టుకుని మీడియాకు చూపించారు. కేంద్రం తీసుకుంటున్న ఇలాంటి ప్రజావ్యతిరేక నిర్ణయాలను సమర్ధిస్తే చెప్పులు తలపై పెట్టుకున్నట్టే అన్నారు. చెప్పులపై జీఎస్టీ పెంపునకు నిరసనగా తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలోనారాయణ షూ పాలిష్ చేస్తూ నిరసన తెలిపారు. నారాయణ తాజా నిరసన హాట్ టాపిక్ అవుతోంది.