కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మన దేశంలో థర్డ్ వేవ్‌కి దారితీస్తుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే పదిహేడు కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తొలి ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. టాంజానియా నుంచి వచ్చిన రాంచీకి చెందిన 37 ఏళ్ల వ్యక్తి కొత్త మహమ్మారి బారిపడ్డాడు. టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ అతనికి ఒమైక్రాన్ సోకింది. ప్రస్తుతం తేలికపాటి లక్షణాలతో చికిత్స పొందుతున్నాడు.
జైపూర్‌లో తొమ్మిది ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వారిలో, ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన కుటుంబంలోని నలుగురు వ్యక్తులు ఉన్నారు. మొత్తం తొమ్మిది మందికి కొత్త వేరియంట్ సోకినట్లు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్ధారించిందని రాజస్థాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది.
మహారాష్ట్రలో ఏడు ఒమిక్రాన్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. పుణె శివార్లలో ఒక కుటుంబంలోని ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. వీరంతా గత నెలలో నైజీరియా నుంచి తిరిగి వచ్చారు. ఏడవ కేసు ఒక వ్యక్తి గత నెలలో ఫిన్‌లాండ్‌కు వెళ్లటంతో కాంటాక్ట్ అయింది. దాంతో మహారాష్ట్రలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది.
అంతకు ముందు కర్నాటకలో రెండు కేసులు బయటపడ్డాయి.శనివారం గుజరాత్‌కు చెందిన 72 ఏళ్ల ఎన్‌ఆర్‌ఐతో పాటు, మహారాష్ట్రలోని థానేకి చెందిన 33 ఏళ్ల వ్యక్తిని ఈ కొత్త వేరియంట్ సోకింది.
మరోవైపు, కొత్త వేరియంట్ యూరప్ అంతటా విస్తరిచింది. కేసుల సంఖ్య వేగంగా పెరుగతోంది. ఆదివారం బ్రిటన్, డెన్మార్క్‌లో డజన్ల కొద్దీ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వైరస్ విస్తృతంగా వ్యాపించటంతో యూరప్ భయం గుప్పిట్లో బిక్కు బిక్కుమంటోంది.ఆదివారం బ్రిటన్‌లో కొత్తగా 86 ఒమిక్రాన్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. దాంతో ఇప్పటి వరకు కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 246కి చేరింది. డెన్మార్క్‌లోనూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజగా 183 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోందని మాత్రం స్పష్టమైంది.
ఈ కొత్త మహమ్మారి అప్పుడే 45 దేశాలకు వ్యాపించింది. అమెరికాలోనూ ఇది వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దాదాపు 20 రాష్ట్రాలకు పాకింది. అయితే ఇది దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందనే దానిపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఐతే, అనేక దేశాలు ఇప్పటికే ప్రయాణ పరిమితుతో పాటు అనేక ఇతర ఆంక్షలు విధించాయి.
ఒమిక్రాన్ కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ దేశాలలో వారాంతపు రోజులలో మరిన్ని కఠిన ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల మహమ్మారి అక్కడ ఉప్పెనలా విరుచుకుపడింది. ఇప్పుడు దీనికి ఒమైక్రాన్ తోడైంది. దాంతో వింటర్ సీజన్‌లో కష్టాలు తప్పేలా లేవు. ఊహించిన దానికంటే పరిస్థితి భయంకరంగా ఉంటుందేమోననే భయాలు జనాన్ని వెంటాడుతున్నాయి.
వింటర్ సీజన్ ప్రారంభంతోనే పశ్చిమ దేశాలలో క్రిస్మస్ సంబరాలు మొదలవుతాయి. ఐతే, ఈ వేడుకలే ఇప్పుడు సూపర్ స్ప్రెడర్స్‌గా మారుతున్నాయి. నార్వే గత నెల చివరి వారంలో జరిగిన ఓ క్రిస్మస్ పార్టీలో పాల్గొన్న 120 మందిలో 100 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు కఠినతరం చేస్తున్నారు.
ఇది ఇలావుంటే, బ్రిటన్ నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళకు ఒమిక్రాన్ నెగెటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో రాష్ట్ర వైద్య అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన 35 ఏళ్ల మహిళ ఈ నెల 1న యూకే నుంచి వచ్చింది. కరోనా పరీక్షలో ఆమెకు పాజిటివ్ వచ్చింది. దాంతో ఆమె నమూనాను జీనోమ్ సీక్వెన్స్ కు పంపటంతో ఒమిక్రాన్ నెగిటివ్‌గా తేలింది.
మరోవైపు, తెలంగాణలో సంక్రాంతి తర్వాత కరోనా కేసులు పెరుగుతాయంటోంది వైద్య ఆరోగ్య శాఖ. ఫిబ్రవరి నాటికి కేసుల సంఖ్య పతాక స్థాయికి చేరే అవకాశం ఉంది. విదేశాల నుంచి వస్తున్నవారిలో కరోనా పాజిటివ్‌లు పెరుగుతున్నాయని వైద్య అధికారులు చెపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముప్పు జాబితాలోని 12 దేశాల నుంచి ఇప్పటివరకు హైదరాబాద్‌కు 900 మందిపైగా వచ్చారు. ఏర్‌పోర్టులలో నిర్వహించిన టెస్టుల్లో 13 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీరందరి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపించారు. ఒకటి రెండు రోజుల్లో ఫలితాలు వస్తాయి. కాబట్టి తెలంగాణలో ఏ క్షణమైనా ఒమిక్రాన్ కేసులు బయటపడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి.
మరోవైపు, ఒమిక్రాన్ సోకినవారిలో ఒళ్లు నొప్పులు, తల నొప్పి, నీరసం ఉండే అవకాశం ఉంది. ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్పయ రీక్షలు చేయించుకోవాలి.
మరోవైపు, ఇకపై వెలుగు చూసే మహమ్మారి ఏదైనా కోవిడ్ -19 కంటే ప్రాణాంతకంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. కోవిడ్-19 నుంచి నేర్చుకున్న పాఠాలను వృధా చేయకుండా వాటి దాడిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మందిని కరోనా పొట్టన పెట్టుకుంది. లక్షల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం కలిగించింది. కోట్లాది మంది జీవితాలను తలక్రిందులు చేసింది. కాబట్టి ఒమైక్రాన్ విషయంలో ఇప్పటికైతే జాగ్రత్తగా ఉండటం మినహా మరో మార్గంలేదు. కాబట్టి మాస్క్ ధరించటం..భౌతిక దూరం పాటించటం ..తరచూ చేతులు శుభ్ర పచరుకోవటం మర్చిపోద్దు!!