NTV Telugu Site icon

Karnataka: మాజీ సీఎంకు దక్కని టికెట్.. బీజేపీకి జగదీష్ షెట్టర్ సవాల్

Jagadish Shettar

Jagadish Shettar

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తొలివిడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 189 మంది అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో 52 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. అయితే తొలివిడత జాబితలో మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్‌ పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో పార్టీలో అసంతృప్తి మొదలైంది. అయితే, ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న జగదీశ్ షట్టర్ గతంలో ముఖ్యమంత్రిగా పని చేశారు. ఈ సారి ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే, ఆయనకు టికెట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది.
Also Read:Gold Price Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇవీ..

మంగళవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో షెట్టర్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయవద్దని చివరి నిమిషంలో హైకమాండ్ తనను కోరిందని చెప్పారు. పార్టీ నిర్ణయంతో తాను నిరాశకు గురయ్యానని చెప్పారు. తాను 30 సంవత్సరాలకు పైగా పార్టీతో ఉన్నానని, పార్టీని నిర్మాణంలో ఎంతో సహాయం చేశానని చెప్పారు. తనకు టికెట్ ఇవ్వడం లేదని రెండు, మూడు నెలల క్రితం చెప్పి ఉంటే.. ఆలోచించేవాడినని తెలిపారు. కానీ, నామినేషన్ల గడువు ముగియడానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నందున, తాను పోటీ చేయకూడదని సూచించారని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో తాను ప్రచారం ప్రారంభించానని వెల్లడించారు. తాను ఎలాగైనా పోటీ చేస్తానని పార్టీ హైకమాండ్‌కు చెప్పానని, పునరాలోచించుకోవాలని కోరానని మాజీ ముఖ్యమంత్రి చెప్పారు.
Also Read:Karnataka Elections: తొలివిడతగా అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీజేపీ.. 52 మంది కొత్తవారికి అవకాశం..

యాంటీ-ఇంకంబెన్సీ వేవ్ ఉందా లేదా అని తాను విచారించానని, పార్టీ అధిష్టానం తన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటారని విశ్వసిస్తున్నాని చెప్పారు. మంగళవారం అగ్ర నాయకత్వం నుంచి పిలుపు వచ్చిందని షెట్టర్ పేర్కొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ సర్వే కూడా బిజెపికి వేవ్ ఉందని సూచిస్తుందన్నారు. తనపై రాజకీయాల్లో ఎలాంటి మచ్చ లేదన్నారు. తాను పార్టీకి విధేయుడిగా ఉన్నానని, విధేయత సమస్యగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.

2012లో రాష్ట్ర బిజెపి మైనింగ్ వివాదంలో చిక్కుకున్నప్పుడు బిఎస్ యడియూరప్పకు నమ్మకమైన సహాయకుడు షెట్టర్ కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. కర్ణాటక అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. ఐదు దశాబ్దాలుగా జనసంఘ్‌తో సంబంధాలు కలిగి ఉన్న షెట్టర్, ఆర్‌ఎస్‌ఎస్‌లో కూడా పనిచేశారు. అతని సోదరుడు ప్రదీప్ షెట్టర్ ఒక ఎమ్మెల్సీ, అతని బంధువు సదాశివ షెట్టర్ హుబ్బల్లి స్థానం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు.
Also Read: Monalisa: మోనాలిసా.. మోనాలిసా.. నువ్విట్టా కనిపిస్తుంటే కుర్రాళ్లకు పుట్టదా ఆశ

కాగా, వచ్చే నెలలో జరగనున్న కర్ణాటక రాష్ట్ర ఎన్నికల కోసం బీజేపీ తన తొలి జాబితాలో 189 మంది అభ్యర్థులను మంగళవారం ప్రకటించింది. మే 10న జరగనున్న 224 స్థానాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండో జాబితా త్వరలో వెలువడనుంది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర తన తండ్రి శికారిపుర స్థానం నుంచి పోటీ చేయనున్నారు.