Site icon NTV Telugu

అఫ్ఘాన్‌లో సామాన్యుల పరిస్థితి ఏంటి…?

అఫ్ఘానిస్థాన్‌లో యుద్ధం సంపూర్ణంగా ముగిసిందని తాలిబన్లు తాజాగా ప్రకటించారు. అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పారిపోవడం పట్ల.. అఫ్ఘాన్‌ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. పాశ్చాత్య దేశాలు తమ సిబ్బందిని వేగంగా స్వదేశానికి తరలించేందుకు ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాలిబన్ల ధాటికి ప్రభుత్వ సేనలు చెల్లాచెదురవడంతో.. ఊహించిన దానికంటే ముందుగానే అఫ్ఘానిస్థాన్.. తాలిబనిస్థాన్ గా మారింది.

20 ఏళ్లుగా జరుగుతున్న పోరాటాన్ని తాలిబన్లు పది రోజుల్లోనే ముగించారు. ఒకటొకటిగా అఫ్ఘానిస్తాన్‌లోని కీలక పట్టణాలన్నింటినీ ఆక్రమించుకుంటూ వచ్చి కాబూల్‌ను సైతం హస్తగతం చేసుకున్నారు. ఈ నగరం నుంచి బయటకు వెళ్లే దారులన్నీ ఉగ్రవాదుల అదుపాజ్ఞల్లోకి వెళ్లిపోయాయి. ఒక్క కాబూల్ విమానాశ్రయం మాత్రమే అమెరికా సైన్యం ఆధీనంలో ఉంది. దీంతో అక్కడి నుంచి విదేశాలకు పారిపోయేందుకు అఫ్ఘానీయులు సిద్ధమయ్యారు. ప్రజలందరూ విమానాశ్రయానికి చేరుకొని, అక్కడ ఉన్న ఒక విమానం ఎక్కేందుకు ప్రయత్నించారు. ఎయిర్‌పోర్టులో నమ్మశక్యం కాని దృశ్యాలు కనిపించాయి.

ఏ సునామీనో భూకంపమో వస్తే పరుగులు తీసినట్లు.. విమానం ఎక్కేందుకు ప్రజలు ఎగబడ్డారు. విమానంలోకి వెళ్లేందుకు వేసిన ఒక మెట్ల నిచ్చెనపై చీమలదండులా వేలాడుతూ కనిపించారు. కాస్త సందు కనపడితే చాలు.. విమానంలోకి దూరేందుకు ప్రయత్నించారు. ఈ దృశ్యాలు అఫ్ఘాన్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అద్దంపడుతున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో గుంపులుగా ఎగబడుతున్న ప్రజలను అదుపుచేయడం కోసం విమానాశ్రయానికి కాపలాగా నిలబడిన అమెరికా దళాలు.. పలుమార్లు గాల్లో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఐదుగురు చనిపోయినట్టు కూడా వార్తలొస్తున్నాయి. కాబూల్ ఎయిర్‌స్పేస్ మూతపడటంతో ఇక్కడి విమాన సర్వీసులన్నీ రద్దయినట్లు తెలుస్తోంది. దీంతో తాము అఫ్ఘానిస్తాన్ నుంచి ఎలా బయటపడాలి? అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమ పౌరులను తరలించాలనుకున్న పాశ్చాత్య దేశాల్లో కూడా అయోమయం నెలకొంది.

గడిచిన 20 ఏళ్లుగా అమెరికా, బ్రిటన్‌, నాటో సంకీర్ణ దళాల సహకారంతో పునర్నిర్మాణం. మూడు లక్షల సుశిక్షితులైన సైనిక సంపత్తి. అగ్రరాజ్యాలు ఇచ్చిన ఆయుధ సంపత్తి. రాష్ట్రాల వారీగా మోహరించే భద్రతా బలగాలు. పోలీసులు. వ్యూహాత్మక స్థానాలపై పట్టు సాధించే నైపుణ్యం. ఇదీ అఫ్ఘానిస్థాన్‌ బలం. మరి తాలిబన్ల బలమేంటి? 75 వేల మంది మిలిటెంట్లే..! అయినా.. రోజుల వ్యవధిలో అఫ్ఘానిస్థాన్‌పై తాలిబన్లు ఎలా పట్టు సాధించగలిగారు? అక్కడే ఉంది తాలిబన్ల రణనీతి. ఎదుటి వారిని ముందుగా హడలగొట్టడం.. ఆ తర్వాత పట్టు సాధించడం తాలిబన్ల స్టైల్‌. పట్టు విడవకుండా, లక్ష్యాన్ని ఛేదించేదాకా నిద్రపోని మొండితనం.. ఆ లక్షణాలే తాలిబన్లకు మళ్లీ అఫ్ఘాన్‌లో అధికారాన్ని కట్టబెట్టాయి. తాలిబన్లకు పాకిస్థాన్‌తోపాటు చైనా, రష్యాలు సహకరించాయనే ఆరోపణలు ఉన్నాయి. అమెరికా తన సేనలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించగానే.. వ్యూహానికి పదును పెట్టాయి. కుందుజ్‌ ప్రాంతంపై కన్నేశాయి. రెండు నెలల పాటు ఆ ప్రాంతాన్ని చుట్టముట్టాయి. ఉత్తర కుందుజ్‌లోని అఫ్ఘాన్‌ సేనలకు అన్నపానీయాలు అందకుండా, అదనపు బలగాలు రాకుండా కట్టడి చేయడంతో సైనికులు తమ ఆయుధాలను అప్పగిస్తూ లొంగిపోయారు. అలా ఒక్కో రాష్ట్రాన్ని తాలిబన్లు ఆక్రమించారు.

అఫ్ఘనిస్థాన్లో కఠినమైన షరియా చట్టం అమలు చేస్తున్నారు తాలిబన్లు. పదేళ్లు పైబడిన బాలికలు ఎవరూ విద్యాసంస్థలకు వెళ్లే వీలు లేదు. ఏ మహిళా పురుషుడి తోడు లేకుండా రోడ్డెక్కే పరిస్థితి ఉండదు. ఇప్పటికే బ్యూటీపార్లర్లన్నీ మూతబడ్డాయి. దుకాణాల్లో ఎక్కడా మహిళా మోడళ్ల ఫోటోలు కనిపించకుండా వ్యాపారులు జాగ్రత్తపడుతున్నారు. తాలిబన్లను వివాహం చేసుకోవడానికి 12 నుంచి 45 ఏళ్ల వయసు గల అవివాహితల జాబితాలు తీసుకురావాలని.. స్థానిక మతపెద్దల్ని ఆదేశించినట్టు తెలుస్తోంది. వయసుకు అనుగుణంగా.. తాలిబాన్లు మహిళలను విభజించుకోవాలని ప్రాణాళికలు చేసుకుంటున్నారు. తాలిబాన్ కమాండర్ల ఆదేశాల మేరకు.. తీవ్రవాదులు ఇంటింటికి వెళుతూ.. బాలికల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇళ్లల్లోకి సైతం ప్రవేశిస్తుండటంతో… స్థానిక ప్రజలు బెదిరిపోతున్నారు.

ఇప్పుడు అఫ్ఘానిస్థాన్‌లో ఉన్న యువతలో ఎక్కువమంది 2001 తర్వాత జన్మించిన వారే. వారికి అమెరికా అందించిన ఫలాలను అనుభవించడమే తెలుసు. అంతకు ముందు తాలిబన్ల అరాచకాల గురించి తెలియదు. దాంతో.. వారు యుద్ధవిద్యల వైపు పెద్దగా దృష్టి సారించలేదు. దీంతో కేవలం వారం రోజుల వ్యవధిలోనే తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకున్నారు. ఈ పరిణామాలకు బాధ్యత వహిస్తూ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తక్షణమే రాజీనామా చేయాలని మాజీ అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేశారు. అఫ్గాన్‌ నుంచి అమెరికా సైన్యాల ఉపసంహరణకు ట్రంప్ హయాంలోనే బీజం పడింది. అమెరికా, మిత్రరాజ్యాల సైన్యాలను 2021 మే నాటికి పూర్తిగా ఉపసంహరించుకుంటామని ట్రంప్ వెల్లడించారు. అయితే, ఈ ఏడాది జనవరిలో అధికారం చేపట్టిన జో బైడెన్.. అఫ్గాన్‌ నుంచి సైన్యం ఉపసంహరణ గడువును సెప్టెంబరు 1కి పొడిగిస్తూ ఎటువంటి షరతులు విధించలేదు. బైడెన్ నిర్ణయంపై ట్రంప్ పలుసార్లు విమర్శలు చేశారు. అఫ్గానిస్తాన్‌లో అమెరికా రాయబారి రాస్‌ విల్సన్‌ కాబూల్‌లోని దౌత్య కార్యాలయాన్ని వదిలేసి విమానాశ్రయానికి వెళ్లిపోయారు. ఎంబసీపై ఎగురుతున్న అమెరికా జాతీయ జెండాను తొలిగించి మరీ వెంట తీసుకుపోవడంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెలువడుతున్నాయి.

అఫ్గానిస్తాన్‌ పునర్నిర్మాణం ఒక విఫల ప్రయోగంగానే మిగిలిపోయింది. తాము ఎవరిపైనా దాడులు చేయబోమని, ప్రభుత్వం బేషరతుగా లొంగిపోవాలని తాలిబన్లు నిర్దేశించారు. దీంతో అఫ్గాన్‌ కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదు. అఫ్గానిస్తాన్‌ తాలిబన్ల వశం కావడంతో అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ తన పదవికి రాజీనామా చేసి, తన బృందంతో కలిసి దేశం విడిచి వెళ్లిపోయారు. తజకిస్తాన్‌కు వెళ్లి తలదాచుకుంటున్నారు. అఫ్గాన్‌ సైన్యం తాలిబన్లకు కనీసం ఎదురు నిలువలేకపోయింది. రాజధాని కాబూల్‌ తాలిబన్ల పరం కావడానికి కనీసం నెల రోజులైనా పడుతుందంటూ అమెరికా సైన్యం వేసిన అంచనాలు తారుమారయ్యాయి. అఫ్గానిస్తాన్‌ పేరును మార్చాలని తాలిబన్లు నిర్ణయించారు. ఇకపై ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్తాన్‌గా పిలవాలని ఆదేశించారు. అధ్యక్ష భవనం నుంచే ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. విదేశీయులకు ఎలాంటి హాని తలపెట్టమని, విదేశీయులు భయపడాల్సిన అవసరం లేదని తాలిబన్లు ప్రకటించారు.

ఫోర్బ్స్‌ 2016లో రూపొందించిన నివేదిక ప్రకారం.. ప్రపంచంలో 10 అత్యధిక సంపద గల ఉగ్రవాద సంస్థల్లో తాలిబన్లు ఐదో స్థానంలో నిలిచారు. 2019-20లో తాలిబన్ల బడ్జెట్‌ 1.6 బిలియన్ డాలర్లు. ఈ నిధుల్లో అక్రమ గనుల ద్వారా 464 మిలియన్ డాలర్లు, మాదకద్రవ్యాల రవాణా ద్వారా 416 మిలియన్ డాలర్లు, విదేశీ విరాళాల ద్వారా 240 మిలియన్ డాలర్లు, ఎగుమతుల ద్వారా 240 మిలియన్‌ డాలర్లు, పన్నుల ద్వారా 160 మిలియన్ డాలర్లు, రియల్‌ ఎస్టేట్‌ ద్వారా 80 మిలియన్‌ డాలర్లు వచ్చాయని అంచనా. గత ఐదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా విక్రయించే నల్లమందులో 84శాతం అఫ్గానిస్థాన్‌ నుంచే వెళ్తోంది. తాలిబన్ల స్వాధీనంలో ఉన్న హెల్మాండ్‌లో ఏకంగా లక్ష 36 వేల 798 హెక్టార్లలో నల్లమందు పంటను సాగు చేస్తున్నట్లు లెక్కలున్నాయి. ఇక కాందహార్‌లో 23 వేల 410 హెక్టార్లు, రాజధాని కాబుల్‌ వద్ద కూడా 484 హెక్టార్లలో ఈ పంటను సాగు చేశారు. వీటిని సాగు చేసినందుకు తాలిబన్లు 10 శాతం పన్ను రూపంలో నల్లమందు రైతుల నుంచి వసూలు చేస్తారు. తాలిబన్లు మాత్రం నల్లమందుతో తమకు సంబంధం లేదని చెబుతారు. 2000 సంవత్సరంలో అధికారంలో ఉన్న సమయంలో నిషేధించిన విషయాన్ని గుర్తు చేస్తారు. ఈ నల్లమందును హెరాయిన్‌, ఇతర మాదక ద్రవ్యాలుగా మార్చే ప్రయోగశాలలు.. దేశంలో 500 వరకు ఉన్నాయి. వీటి నుంచి కూడా వారు పన్నులు వసూలు చేస్తారు. దీంతోపాటు ఎగుమతి దారుల వద్ద నుంచి కొంత మొత్తంలో సొమ్ము అందుతుంది. తాలిబన్ల ఆదాయంలో 60 శాతం మాదక ద్రవ్యాల నుంచే లభిస్తుందని అమెరికా సైన్యం విశ్వసిస్తోంది.

ఏవి తల్లీ? నిరుడు కురిసిన హిమ సమూహములు? అన్న మహాకవి శ్రీశ్రీ భావంలోని బాధ.. అఫ్ఘనిస్తాన్‌కు సరిగ్గా సరిపోతుంది. సింధునాగరికత విలసిల్లిన ప్రాంతాల్లో ఒకటిగా పేరుపొంది, రుగ్వేద కాలంలో సువాసనల భూమిగా ప్రాముఖ్యత వహించి, మహాభారత యుద్ధం నాటికి మహాసామ్రాజ్యంగా నిలిచిన గాంధార భూమి.. క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. ఒకప్పటి సుభిక్ష సామ్రాజ్యం ఆధునిక యుగం వచ్చేసరికి.. అగ్రరాజ్యాల చదరంగంలో పావుగా మారింది. పౌరహక్కుల హననం, నిత్య యుద్ధాలతో అఫ్గాన్‌ అలసిపోయింది.

అమెరికా సేనలు అటు మొహం తిప్పగానే ఇటు తాలిబన్లు తలెగరేశారు. వారి ధాటికి తట్టుకోలేక అధ్యక్షుడు ఘనీ అధికారాన్ని తాలిబన్లకు అప్పగించారు. గతంలో తాలిబన్ల కారణంగా అటు అఫ్గాన్‌లు, ఇటు ఇతర దేశాలు అనుభవించిన ఇబ్బందులు గుర్తొచ్చి ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. ఈ ప్రాంత నైసర్గిక స్వరూప రీత్యా ఇక్కడ ఎక్కువగా అశ్వాలపై సంచారం ఎక్కువగా ఉండేది. ఈ అశ్వికుల తెగలు నివసించే ప్రాంతం కనుక క్రమంగా అఫ్గానిస్తాన్‌గా మారింది. అఫ్గానిస్తాన్‌ ప్రాంతంలో మానవ నివాసం ప్రాచీన శిలా యుగం నాటి నుంచి ఉంది. గాంధార రాజ్య పతనానంతరం జొరాష్ట్రియన్‌ మతం ఇక్కడ ప్రబలింది. అరబ్బుల దండయాత్రల అనంతరం ఇతర మతాలు దాదాపు క్షీణించి ముస్లింల ప్రాబల్యం పెరిగింది. 1978 తిరుగుబాటు తర్వాత సోషలిస్టు రాజ్యం రూపాంతరం చెందింది. కానీ తిరుగుబాట్లు అధికం కావడం, రష్యాతో ముజాహిద్దీన్ల యుద్ధంతో అస్థిరత నెలకొంది. 1994లో ఆవిర్భవించిన తాలిబన్లు 1996 నాటికి అఫ్గానిస్తాన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. వీరిపై 2001లో అమెరికా దాడులు జరిపి ఊచకోత కోసింది. అమెరికా అండతో పౌర ప్రభుత్వం ఏర్పాటైంది. రెండు దశాబ్దాలు అమెరికా, మిత్రదేశాల రక్షణలో అఫ్గాన్‌లో ప్రజాస్వామ్యం చిగుర్లు వేయడం ఆరంభించింది. 2004లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన హమీద్‌ కర్జాయ్‌ అధ్యక్షుడయ్యారు. 2014లో అష్రాఫ్‌ ఘనీ అధ్యక్షుడిగా ఎన్నికై ఆదివారం దాకా పాలించారు. అమెరికా బలగాల ఉపసంహరణ చేపట్టడం అఫ్గాన్‌కు అశనిపాతంగా మారింది.

అఫ్గనిస్తాన్‌ను దాని కర్మానికి దాన్ని వదిలేసి.. అమెరికా వెళ్లిపోవడాన్ని చాలామంది హర్షించటం లేదు. ఆ దేశం కుక్కలు చింపిన విస్తరిగా మారుతుందని, చైనా పాకిస్తాన్‌లు తమ స్వప్రయోజనాల కోసం ఆ దేశాన్ని వాడుకుంటాయని, ఇన్నాళ్లూ అఫ్గన్ ప్రభుత్వంతో స్నేహంగా వున్న ఇండియా చిక్కుల్లో పడుతుందని భయపడుతున్నారు. అమెరికా యీ ఊబిలో ఎందుకు దిగబడిందో, ఎందుకు బయటపడా లనుకుంటోందో అర్థం కావాలంటే గతం గురించి తెలియాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. అమెరికా అగ్రరాజ్యంగా ఆవిర్భవించింది. ప్రపంచంలో ఎక్కడ పెట్రోలు వున్నా, ఖనిజాలు వున్నా కన్ను వేయడం, స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది . ఇటు రష్యా కూడా యితర దేశాలపై ఆధిపత్యానికి ప్రయత్నించడంతో యిద్దరి మధ్య కొంతకాలం కోల్డ్ వార్ నడిచింది. తర్వాత రష్యా బలహీనపడి, తన యిల్లు తనే చక్కబెట్టుకోలేక విచ్ఛిన్నమైనా, అమెరికా ఆగలేదు. అమెరికా మార్కు రాజకీయాలకు అఫ్గనిస్తాన్ మరో ఉదాహరణ. అక్కడ విలువైన ఖనిజాలున్నాయి. భౌగోళికంగా అది కీలకమైన ప్రాంతంలో వుంది. దానికి పశ్చిమాన ఇరాన్, తూర్పున, దక్షిణాన పాకిస్తాన్, ఉత్తరాన టర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, ఈశాన్యాన చైనా ఉన్నాయి. అక్కడి నుంచి అనేక దేశాలపై గూఢచర్యం నెరపవచ్చు.

1992 నుంచి 1996 వరకు అఫ్గనిస్తాన్‌లో భయంకరమైన అంతర్యుద్ధం చెలరేగింది. ముజాహిదీన్‌లు తమలో తాము తన్నుకున్నారు. అంతర్యుద్ధంలో తాలిబాన్లు ముజాహిదీన్‌లపై పైచేయి సాధించారు. 1996 నాటికి దేశంలోని నాల్గింట మూడువంతుల ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. రాజధానిని కాబూల్ నుంచి దక్షిణంలో తమ అధీనంలో వున్న కాందహార్‌కు మార్చారు. ఒకసారి అధికారంలోకి వచ్చాక అమెరికన్ల వద్ద పొందిన ఆయుధాలతోనే అమెరికాను ఎదిరించ సాగారు. పాకిస్తాన్ ద్వారా వారిని కట్టడి చేయబోయింది అమెరికా. వాళ్ల ఉగ్రవాదాన్ని అదుపు చేయడానికి మీరు సాయం చేయాలంటూ పాక్ ప్రభుత్వం అమెరికా నుంచి నిధులు దండుకుంటూ, మరో పక్క ఉగ్రవాదం ఎప్పటికీ చల్లారకుండా చూసింది. ఆ కారణంగా తాలిబాన్లు బలపడుతూనే వచ్చారు. చివరకు వాళ్లు ఏ స్థాయికి వచ్చారంటే 1999 నాటికే అల్ ఖైదాతో పొత్తు కుదుర్చుకుని 2001 సెప్టెంబరులో అమెరికాపై దాడి చేయడానికి ఒసామా బిన్ లాడెన్‌కు సహాయ సహకారాలందించారు.

తాము పాలు పోసి పెంచిన పాము తననే కాటేయడంతో అమెరికాకు కోపం వచ్చింది. వెంటనే అక్టోబరులో అఫ్గనిస్తాన్‌పై దాడి చేసింది. తనతో పాటు నాటో సైన్యాలను కూడా తీసుకొచ్చింది. 2001 డిసెంబరులో తాలిబాన్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. లాడెన్ దొరక్కుండా పారిపోయాడు. అమెరికా యునైటెడ్ నేషన్స్ ద్వారా హమీద్ కర్జాయ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించింది. అఫ్గన్‌ను పునర్నిర్మిస్తున్నామంటూ నిధులు కురిపించింది. 2004లో ఎన్నికలు జరిపించి, కర్జాయ్‌ని అధ్యక్షుణ్ని చేసింది. ఆ ఎన్నికలో అక్రమాలు జరిగాయి అంటూ ఆరోపణలు వచ్చాయి. కర్జాయ్‌ను అమెరికా కీలుబొమ్మగానే చూశారు ప్రజలు. అమెరికా అఫ్గన్ ప్రభుత్వసేనలకు ఆయుధాలిచ్చింది. తర్ఫీదు యిచ్చింది. అధ్యక్షులు మారారు. రాజకీయ నాయకులు వారిలో వారు తగవులాడుకున్నారు. ఏం చేసినా తాలిబన్లను రూపుమాపలేక పోయింది. గత 20 ఏళ్లగా అమెరికా ఎన్ని తంటాలు పడినా సమస్య పెద్దదైంది తప్ప తగ్గలేదు. ఇది మరో వియత్నాంగా మారుతోందని గ్రహించి, ఒబామా హయాంలో అడుగులు వెనక్కి తీసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. కానీ ఆ ప్రక్రియ ట్రంప్ హయాంలో నత్తనడక నడిచింది.

ఎందుకంటే అనుకోగానే మూటాముల్లె సర్దేసుకుని వెళ్లిపోవడం అంత సులభమైన పని కాదు. రష్యన్లు అయితే అఫ్గన్ సరిహద్దుల్లో వున్న తమ దేశాల ద్వారా సులభంగా వెనక్కివెళ్లారు. అమెరికా అయితే చాలా దూరంలో వుంది. బగ్రామ్, జలాలాబాద్, కాందహార్‌ల నుండి విమానాల్లోనే బయటపడాలి. తాలిబాన్లు సహకరిస్తే తప్ప క్షేమంగా బయటపడలేరు. పైగా అమెరికా వుండగా దానికి సహకరించిన వారందరినీ ఉపసంహరణ తర్వాత తాలిబాన్లు మట్టుపెడతారన్న భయం వుంది. అందుకని తాలిబన్లను, అఫ్గన్ ప్రభుత్వాన్ని కూడా కూర్చోపెట్టి 2018లో త్రైపాక్షిక చర్చలు ప్రారంభించింది. చర్చల కారణంగా జాప్యం జరిగి, ఖర్చులు మరింత పెరిగాయి. ఇప్పటికి 20 ఏళ్లలో అమెరికా 177 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 2500 మంది అమెరికన్ సైనికులు, నాటో వారు వెయ్యి మంది మరణించారు. 20 వేల మందికి తీవ్రగాయాలయ్యాయి.

అఫ్గనిస్తాన్ పర్వతప్రాంతం, బయటివాళ్లకు భూమార్గాన దాన్ని జయించడం కష్టం. అందువలన అమెరికా కసికొద్దీ బాంబులు వేసేది. 2.41 లక్షల మంది చనిపోయారు. అంతకు అనేక రెట్లు ఆకలితో చనిపోయారు. ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్‌లలో 71వేల మంది పౌరులు, 78 వేల మంది అఫ్గన్ సైనికులు, పోలీసులు చనిపోయారు. తిరుగుబాటుదారులు 84 వేల మంది చనిపోయారు. అమెరికా సైన్యం వెనక్కి వచ్చేస్తూ వాళ్లతో బాటు యుద్ధ పరికరాలు కూడా తీసుకుని వచ్చేద్దామని చూస్తున్నారు. ఎందుకంటే అవి తాలిబన్ల చేతుల్లో పడ్డాయంటే వాటి సాయంతో అఫ్గన్ సైన్యాలను, తమను ఎదిరించినవాళ్లను అందర్నీ చంపగలరు. అయితే ఎస్‌యువిలు, ట్యాంకుల వంటి కొన్ని పరికరాలు విమానాల్లో ఎక్కించలేరు కదా. అందుకని వాటిని ధ్వంసం చేస్తున్నారు.

మన ప్రభుత్వం ఆఫ్గనిస్తాన్‌లో అనేక ప్రాజెక్టులు చేపట్టింది. ఆ దేశానికి ఎంతో ఆర్థికసాయం చేసింది. రకరకాల వృత్తులకు చెందిన భారతీయులెందరో ఆ దేశంలో ఉన్నారు. ఇప్పుడు ఆ డబ్బూ పోయింది. ఆ గుడ్‌విల్లూ పోయింది. అమెరికా స్థానాన్ని చైనా, పాక్‌లు ఆక్రమించే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇప్పటికే అఫ్ఘాన్ ను అభివృద్ధి చేస్తామని.. తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది డ్రాగన్ దేశం. వాళ్లు ఇండియన్లను తరిమివేయాలనే సలహా యిస్తారు. ఈ విషయం మన ప్రభుత్వానికి బాగా తెలుసు. అందుకని సాధ్యమైనంత త్వరగా అఫ్గన్ వదిలి వచ్చేయండని మన వాళ్లకు సలహా యిస్తోంది.

రష్యన్లు పదేళ్ల పాటు ఆక్రమించి, వెళ్లిపోయాక వాళ్లు నిలబెట్టిన ప్రభుత్వం పడుతూ లేస్తూ మూడేళ్లు నడిచింది. కానీ అమెరికన్లు 20 ఏళ్లు పాలించినా, వాళ్లు నిలబెట్టిన ప్రభుత్వం వారాల్లో పడిపోతోంది. ఎందుకంటే యీసారి తాలిబాన్లు మొదటి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తూ తమ ప్రత్యర్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయగలిగారు. తాలిబాన్లు గతంలో అయితే పట్టుబడిన సైనికులను చంపేసేవారు. ఇప్పుడు స్ట్రాటజీ మార్చారు. ఏదైనా ఊరిని వశపరుచుకోగానే అక్కడున్న సైన్యాన్ని పిలిచి మాతో చేరిపోండి. లేదా యిదిగో యీ డబ్బు పుచ్చుకుని ఎక్కడికైనా పారిపోండి. అంటున్నారు. చాలామంది బతుకు జీవుడా అని పారిపోతున్నారు.

తాలిబన్ల పాలన మొదలయ్యాక అమెరికా నీడ అస్సలు పడకుండా వుండాలని, తమకే ప్రాధాన్యం వుండాలని చైనా, పాకిస్తాన్‌లు ప్లాన్ చేస్తున్నాయి. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్, అఫ్గనిస్తాన్ సరిహద్దుల్లోంచి వెళుతుంది. ఆసియా, యూరోప్ ఖండాలను కలిపే వాణిజ్య మార్గం ఒన్ బెల్ట్ ఒన్ రోడ్ పథకాన్ని ఎంతో ఖర్చుతో రూపొందించి, అమలు చేస్తోంది చైనా. మధ్యదారిలో ఉన్న అఫ్గనిస్తాన్‌లో అశాంతి చెలరేగి, ఉగ్రవాదానికి కంచుకోటగా మారితే, దాని వ్యాపార ప్రయోజనాలు దెబ్బ తింటాయి.

అందువల్ల అఫ్గనిస్తాన్ ఆర్థిక సుస్థిరత కోసం, తన స్వార్థం కోసం ఎనర్జీ, మినరల్స్, రా మెటీరియల్ సెక్టార్లలో పెద్ద స్థాయిలో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టింది. చైనాతో తన ఆర్థిక ప్రయోజనాలను ముడి వేసుకున్న పాకిస్తాన్ సంగతి సరేసరి. ఇన్నేళ్లగా తాలిబాన్లకు ఆశ్రయం యిచ్చి ఆదుకున్నందుకు వాళ్లు కృతజ్ఞతాపూర్వకంగా వుంటారని దాని ఆశ.

చైనా, పాకిస్తాన్‌లు అమెరికాను, దానికి మద్దతిస్తున్న భారత్‌ను దగ్గరకు రానీయటం లేదు. అఫ్గనిస్తాన్‌లో పరిస్థితి చెడిపోతే అమెరికా మమ్మల్ని జోక్యం చేసుకోమంటుంది. నిర్మాణాత్మకమైన పనులుంటే మాత్రం భారత్‌కు అప్పగిస్తుందని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే వాపోయారు. అందుకే ఖతార్‌లో జరిగే అఫ్గన్ శాంతి చర్చల్లో ఇండియాను పాలు పంచుకోనీయటం లేదు. అయితే ఖతార్ పట్టుబట్టడంతో ఆగస్టు 12న తొలిసారి భారత్ పాల్గొంది. కానీ చైనా, పాకిస్తాన్‌ల ప్రమేయం పెరిగినకొద్దీ భారత్‌కు వచ్చే లాభం ఏమీ కనబడటం లేదు. భారత్ ప్రభుత్వం తాలిబన్లతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గతంలో తాలిబాన్ల పాలన వుండగా కశ్మీర్‌లో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. రెండేళ్లగా కశ్మీర్‌ను కేంద్రమే డైరక్టుగా పాలిస్తున్నా అక్కడ శాంతిభద్రతలు మెరుగు పడలేదు. మన ప్రభుత్వం మాత్రం తాలిబన్ల నాయకత్వంలో సర్కారును గుర్తించేది లేదని ప్రకటించింది.

ఒక అంచనా ప్రకారం అఫ్గానిస్తాన్‌లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సంస్థల పునర్నిర్మాణం కోసం భారత్ ఇప్పటి వరకూ మూడు బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. అఫ్గానిస్తాన్ పార్లమెంటు భవనాన్ని భారత్ నిర్మించింది. ఆ దేశంతో కలిసి ఒక పెద్ద ఆనకట్ట కూడా నిర్మించింది. విద్య, టెక్నాలజీ రంగాల్లో సహకారం కూడా అందించింది. దానితోపాటూ అఫ్గానిస్తాన్‌ సహజ వనరుల్లో పెట్టుబడులను కూడా భారత్ ప్రోత్సహించింది. ఇరు దేశాల మధ్య దృఢమైన బంధం ఉండడంతో, ఇప్పుడు అఫ్గానిస్తాన్‌లో తన పెట్టుబడులు గురించి భారత్ ఆందోళనతో ఉంది. తాలిబన్ల వల్ల పాకిస్తాన్‌ మీద తమ వ్యూహాత్మక ఆధిపత్యాన్ని కోల్పోవడంపై భారత్ ఎక్కువగా ఆందోళన చెందుతోంది. అఫ్గానిస్తాన్‌లో భారత్ బలోపేతం కావడం వల్ల పాకిస్తాన్ మీద ఒక మానసిక, వ్యూహాత్మక ఒత్తిడి పడుతుంది. ఆ దేశంలో భారత్ పట్టు కోల్పోవడం అంటే, అక్కడ పాకిస్తాన్ ఆధిపత్యం పెరుగుతుందనే అర్థం.

ఆఫ్గనిస్తాన్ దేశానికి ఇండియా ఎంతగానో సహకరిస్తోంది. ఈ దేశంలో వేలాది ఆఫ్ఘన్ విద్యార్థులు చదువుకుంటున్నారు.వారికి భారత ప్రభుత్వం స్కాలర్ షిప్ లను మంజూరు చేస్తోంది. భారత్​ అభివృద్ధి చేసిన మౌలిక వసతులను తాలిబన్లు నాశనం చేయడం, ప్రజల్ని చంపడం, చిత్రహింసలకు గురి చేయడం సర్వసాధారణమైంది. కాశ్మీర్ అంశాన్ని సజీవం చేస్తున్న తాలిబన్లు పాక్‌‌తో కలిసి భారత్‌‌ను అస్థిర పరచాలని చూస్తున్నారు. 2017 వ్యాపార ఒప్పందంలో భాగంగా ఏయిర్‌‌ ఫ్రైట్‌‌ కారిడార్‌‌ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఇండియా నుంచి అఫ్గాన్‌‌కు 900 మిలియన్ డాలర్ల ఎగుమతులు, 500 మిలియన్‌‌ డాలర్ల దిగుమతులు జరుగుతున్నాయి. అక్కడి నుంచి డ్రై ఫ్రూట్స్‌‌ అధికంగా దిగుమతి అవుతున్నాయి. ఎగుమతుల్లో ఫార్మా, మెడికల్‌‌ పరికరాలు, సిమెంట్‌‌, రా మెటీరియల్‌‌, షుగర్‌‌, కంప్యూటర్లు తదితర వస్తువులు ఉన్నాయి. ఢిల్లీ – కాబూల్‌‌, హీరత్‌‌ ఢిల్లీల మధ్య ప్రస్తుతం వాణిజ్యం జరుగుతోంది. ఇప్పుడు తాలిబన్లు అధికారంలోకి రావడం.. భారత్ కు శరాఘాతమే.

2001 నుండి వరుసగా వచ్చిన భారత ప్రభుత్వాలన్నీ.. అఫ్గనిస్థాన్లో ప్రజాస్వామ్యానికి మద్దతిస్తూ వచ్చాయి. ఆఫ్ఘన్‌లో అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల నిర్మాణాలకు కోట్లాది డాలర్లను ఖర్చు పెట్టడం ద్వారా జాతి నిర్మాణంలో సాయపడుతూ వస్తున్నాయి. ఇప్పుడు తాలిబన్లు ఇస్లాం రాజ్యం స్థాపిస్తే.. ఇండియా ప్రయోజనాలే కాదు.. అక్కడ ఉన్న ఇండియన్ల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి. అమెరికా సైన్యం అఫ్ఘనిస్థాన్లో ఉండగానే… పులిట్జర్ అవార్డు గ్రహీత డానిష్ సిద్ధిఖీని బందీగా పట్టుకుని మరీ చంపేసిన తాలిబన్లు.. ఇప్పుడు కాబూల్ అధికార పీఠంపై కూర్చుని ఏం చేస్తారో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సమస్యాత్మకమైన ఆఫ్గనిస్తాన్ వ్యవహారాల్లోకి అమెరికా అనవసరంగా చొరబడి, సమస్యను మరింత జటిలం చేసి వెళ్లిపోతోందని అఫ్గన్లు తిట్టుకుంటున్నారు. చేసిందేదో చేశాం, యికపై అఫ్గన్లు వాళ్ల దేశాన్ని వాళ్లే కాపాడుకోవాలి, నడుపుకోవాలి అంటున్నారు బైడెన్. కానీ ఇది అమెరికా, అప్ఘనిస్థాన్ మధ్య వ్యవహారం మాత్రమే కాదు. అప్ఘాన్ చుట్టుపక్కల ఉన్న పది దేశాల ప్రయోజనాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. యుద్ధానికి వచ్చినప్పుడు అందరి సహకారరం కోరి.. ఏకపక్షంగా ఉపసంహరణ చేసిన అమెరికా.. భారత్, తజకిస్థాన్, తుర్కుమెనిస్థాన్ లాంటి అఫ్గాన్ సరిహద్దు దేశాలన్నింటినీ ప్రమాదంలోకి నెట్టింది. అఫ్గాన్‌ పౌరుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా తాలిబన్లకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించినట్లు సమాచారం. అయితే కరడుగట్టిన షరియా చట్టాలకు మాత్రమే కట్టుబడే తాలిబన్లు, ప్రజాస్వామ్యానికే విలువ ఇవ్వని తాలిబన్లు.. ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు కట్టుబడి ఉంటారని ఆశించడం అత్యాశే అవుతుంది.

Exit mobile version