చైనాలో వెలుగు చూసిన కరోనా మహమ్మారి.. ఇప్పటికీ ప్రపంచ దేశాలపై వివిధ రూపాల్లో దాడి చేస్తూనే ఉంది.. అయితే, మహమ్మారి కట్టడికి అనేక పరిశోధనల తర్వాత.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది… ఆ తర్వాత భారత్‌లో ఒక ఫౌడర్ కూడా అందుబాటులోకి తెచ్చారు.. ఇప్పుడు మహమ్మారి చికిత్సలో టాబ్లెట్ కూడా చేరింది… అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో తొలిసారిగా కోవిడ్‌పై పోరాటానికి తొలి మాత్రకు అనుమతి ఇచ్చింది.. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఇవాళ తొలి కోవిడ్ పిల్ కు ఆమోదముద్ర వేసింది. కోవిడ్ చికిత్సలో అత్యవసర వినియోగానికి ఫైజర్ సంస్థ రూపొందిన టాబ్లెట్లకు అనుమతి లభించింది… దాదాపు ఏడాది కిందట వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, దాని తయారీ, పంపిణీలో సంక్లిష్టతల కారణంగా చిట్టచివరి మనిషికీ టీకాలు అందడంలేదు. అదీగాక చాలా మందిలో టీకాలపై ఉన్న తప్పుడు అభిప్రాయాలను పోగొట్టడం ప్రభుత్వాలకు సమస్యగా మారింది. డెల్టా, ఇతర వేరియంట్ల ఉధృతి తగ్గుతుందనుకునేలోపే సౌతాఫ్రికా నుంచి పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచానికి కొత్త ముప్పుగా వాటిల్లింది. వ్యాక్సిన్‌పై ఎంత ప్రచారం చేసినా.. పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌కు అందరూ ముందుకు రాకపోవడంతో.. ఇప్పుడు కోవిడ్ చికిత్సలో చేరిన తొలి టాబ్లెట్ కీలక పాత్ర పోషిస్తుందనే అభిప్రాయాలున్నాయి.
ఇక, చరిత్రలోనే తొలిసారి కోవిడ్‌పై తొలి టాబ్లెట్‌ను ఫైజర్ రూపొందించింది.. ఇప్పటికే కరోనాపై పోరాటంలో వ్యాక్సిన్ అభివృద్ధి చేసి.. ప్రపంచదేశాలకు ఎగుమతి చేసిన ఫైజర్.. చిన్నారులకు కూడా వ్యాక్సిన్ డెవలప్‌చేసింది.. ఇప్పుడు.. పాక్స్‌లోవిడ్ (Paxlovid) పేరుతో టాబ్లెట్‌ను తీసుకొచ్చింది.. ఇక, దీని డేటాను పరిశీలించిన ఎఫ్డీఏ.. అత్యవసర వినియోగానికి అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది.. అమెరికాలో కరోనాపై పోరులో ఈ టాబ్లెట్ రాక విప్లవాత్మక మార్పును తెస్తుందని, ఫైజర్ వారి పాక్స్‌లోవిడ్ కోవిడ్ మాత్ర ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక, తీవ్రమైన కోవిడ్ లక్షణాలున్నవారికి కూడా ఈ టాబ్లెట్లను అత్యవసరంగా వాడొచ్చని ఎఫ్డీఏ.. అమెరికాలోని ఆస్పత్రులకు సూచించింది. మరోవైపు.. ఫైజర్ సంస్థ ఇప్పటికే కోటికిపైగా టాబ్లెట్లను సిద్ధం చేసింది.. ఇప్పుడు అనుమతి కూడా లభించడంతో.. ఉత్పత్తి మరింత పెంచేందుకు సిద్ధం అవుతోంది.